
బెంగళూర్ : ఈ ఏడాది విద్యాసంవత్సరంలో సిలబస్‌లో మార్పులు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై కర్ణాటక సర్కార్ వెనక్కి తగ్గింది.18వ శతాబ్ధపు మైసూర్ పాలకుడు టిప్పు సుల్తాన్ ,హైదర్ అలీకి సంబంధించి పాఠ్యాంశాలను తొలగిస్తూ చేసిన ప్రకటనను ప్రభుత్వం నిలిపివేసింది. ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం ఖరారు కాలేదని, త్వరలోనే స్పష్టత ఇవ్వనున్నట్లు పేర్కొంది. లాక్‌డౌన్ కారణంగా పాఠశాలల పునఃప్రారంభంపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రానుందున విద్యా సంవత్సరం ఇంకా ఎన్ని రోజులు మిగిలి ఉన్నాయో తెలియదని, ఈ నేపథ్యంలో సిలబస్‌లో మార్పుల అంశంపై తుది వివరాలను వెబ్‌సైట్‌లో వెల్లడిస్తామని తెలిపింది. (పాఠ్యాంశాల నుంచి టిప్పు సుల్తాన్ చాప్టర్ తొలగింపు)
తొమ్మిది నుంచి పన్నెండో తరగతి సిలబస్‌ను కుదించే క్రమంలో లౌకికవాదం, పౌరసత్వం, సమాఖ్య వ్యవస్థల వంటి అంశాలను తొలగించాలన్న సీబీఎస్‌ఈ నిర్ణయం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీనికి అనుబంధంగా కర్ణాటక సైతం సిలబస్‌ను 30 శాతం తగ్గించే ఉద్దేశంతో పాఠ్య పుస్తకాల నుంచి మైసూర్ పాలకులు హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ చాప్టర్‌లను తొలగిస్తూ ప్రకటన జారీ చేసింది. మొఘల్, రాజ్‌పుత్‌ల చరిత్రకు సంబంధించిన అథ్యాయాలు, జీసస్, మహ్మద్ ప్రవక్త బోధనల అథ్యాయాలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాజకీయ దుమారం తలెత్తడంతో సర్కార్ కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
ఈ అంశంపై ఇప్పుడే నిర్ణయం తీసుకోలేమని, త్వరలోనే ఖరారు చేస్తామని వెల్లడించింది. కాగా మహమ్మారి నేపథ్యంలో తీసుకున్న సిలబస్ కుదింపు నిర్ణయం ప్రస్తుత విద్యా సంవత్సరానికే సిలబస్ కుదింపు వర్తిస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఒకటి నుంచి పదోతరగతి వరకూ సాధారణ విద్యాసంవత్సరంలో 210-220 పనిదినాలు కాగా, ఈ ఏడాది మాత్రం 120-140 ఉండనున్నట్లు పేర్కొన్నారు. దీనికి అనుగుణంగానే సిలబస్‌ను కుదిస్తూ మార్పులు చేపట్టారు. (పాఠశాల, ఉన్నత విద్యలో భారీ సంస్కరణలు)
Comments
Please login to add a commentAdd a comment