సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో హిజాబ్ వివాదంపై పలుచోట్ల విద్యార్థులకు తల్లిదండ్రులకు, పాఠశాలల సిబ్బంది మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. శివమొగ్గ, చిక్కమగళూరు, ఉడుపి, తుమకూరు, కొడగు తదితర ప్రాంతాల్లో మంగళవారం విద్యార్థినులు నిరసనకు దిగారు. హైకోర్టు మధ్యంతర ఆదేశాల మేరకు మత చిహ్నాలతో విద్యాలయాల్లోకి రాకూడదని ఉపాధ్యాయులు, పోలీసులు చెప్పడంతో తమకు సంప్రదాయమే ముఖ్యమని కొందరు విద్యార్థినులు తరగతులను, ప్రిపరేటరీ పరీక్షలను బహిష్కరించారు.
ఉడుపి జిల్లా కాపు మల్లారు ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాలలో హిజాబ్ తొలగించి తరగతిలోకి ప్రవేశించేందుకు విద్యార్థినులు అంగీకరించలేదు. చివరికి హిజాబ్ ధరించి పదో తరగతి ప్రీఫైనల్ పరీక్షలను విద్యార్థినులు రాశారు. శివమొగ్గ నగరంలోని కేపీఎస్ ఉన్నత పాఠశాలలో హిజాబ్ తీసేయడం ఇష్టం లేదని తరగతులను బహిష్కరించి ఇద్దరు విద్యార్థినులు ఇళ్లకు వెళ్లిపోయారు.
చిక్కమగళూరు మౌలానా ఆజాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 11 మంది విద్యార్థినులు పాఠశాలలో బైఠాయించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య వాగ్వాదం చెలరేగింది. పాఠశాలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. గదగ్ జిల్లాలోనూ ఒక పాఠశాలలోనూ కొందరు బాలికలు నిరసన తెలిపారు. దావణగెరె జిల్లా హోన్నాళిలో 50, చెన్నగిరలో 30, నల్లూరిలో 20, హరిహరలో 23 మంది విద్యార్థినులు హిజాబ్ తీసేందుకు నిరాకరించి, తమకు మత సంప్రదాయమే ముఖ్యమని తరగతులను బహిష్కరించి ఇళ్లకు వెళ్లిపోయారు.తుమకూరు ఎస్‌వీఎస్ స్కూల్ ముందు విద్యార్థినుల తల్లిదండ్రులు ‘అల్లా హు అక్బర్’ అంటూ నినాదాలు చేశారు. జగత్‌లోని ఉర్దూ పాఠశాలకు 80 మందికి పైగా విద్యార్థినులు గైర్హాజరయ్యారు.
రాయచూరులో చదువుతో పాటు తమకు హిజాబ్ కూడా ముఖ్యమని, హిజాబ్ ధరించేందుకు అవకాశం కల్పించాలని తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో గొడవకు దిగారు.
హైకోర్టు ఉత్తర్వులు అమలు చేస్తాం.. హిజాబ్ వ్యవహారంపై హైకోర్టు ధర్మాసనం జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వును కచ్చితంగా అమలు చేస్తామని కర్ణాటక న్యాయ శాఖ మంత్రి జె.సి.మధుస్వామి ప్రకటించారు. రాష్ట్ర శాసనసభలో మంగళవారం హిజాబ్ అంశాన్ని కాంగ్రెస్ సభ్యుడు యు.టి.ఖాదర్ లేవనెత్తారు. హైకోర్టు ఉత్తర్వును పాటించే విషయంలో క్షేత్రస్థాయిలో స్పష్టత లేకుండా పోయిందని అన్నారు.
ఆ మత సంస్థలపై కఠిన చర్యలు..
సమాజంలో అలజడి సృష్టిస్తూ, అమాయక విద్యార్థుల మనసుల్లో విష బీజాలు నాటుతున్న మత సంస్థలను గుర్తించి, వాటిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు కర్ణాటక హోంశాఖ మంత్రి జ్ఞానేంద్ర మంగళవారం చెప్పారు.
చర్యలు తీసుకోవాలి..
హిజాబ్ రగడ వెనుక ఉన్న సంస్థలు, శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కర్ణాటక కాంగ్రెస్ ముస్లిం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. వారు మంగళవారం ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మైని కలిశారు. త్వరలో ప్రవేశపెట్టబోయే రాష్ట్ర బడ్జెట్‌లో మైనారిటీల సంక్షేమానికి నిధుల కేటాయింపులు భారీగా పెంచాలని కోరారు.
హిజాబ్ మత వ్యక్తీకరణ కాదు
విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడంపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని వ్యతిరేకిస్తూ ఉడుపిలోని పీయూసీ ప్రభుత్వ కళాశాలకు చెందిన ముస్లిం విద్యార్థినులు దాఖలు చేసిన పిటిషన్‌పై కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితురాజ్ అవస్తీ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. భారత్‌లోని లౌకికవాదం సానుకూలమైనదని, టర్కీ తరహా లౌకికవాదం కాదని పిటిషనర్లు పేర్కొన్నారు. హిజాబ్ ధరించి తరగతులకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. హిజాబ్ వివాదంపై హైకోర్టు ఇటీవల జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వు తమ ప్రాథమిక హక్కులను హరించేలా ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను బుధవారం మధ్యాహ్నానికి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment