బెంగళూరు: చైనా నుంచి కరోనా ఒమిక్రాన్ వేరియెంట్ బీఎఫ్.7 స్ట్రెయిన్ భారత్‌లో విజృంభించే అవకాశాల నేపథ్యంలో.. కేంద్రం రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ఓ అడుగు ముందుకు వేసింది. బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే కాకుండా దాదాపుగా అంతటా మాస్క్ తప్పనిసరి చేస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది.
పలు దేశాల్లో ప్రధానంగా పొరుగు దేశం చైనాలో కరోనా కల్లోలం ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. బీఎఫ్.7 ప్రభావంతో కరోనా కేసులు, మరణాలతో చైనా ఆగం అవుతోంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ఇక కర్ణాటక ప్రభుత్వం బహిరంగ ప్రదేశాలతో పాటు ఇండోర్ లొకేషన్స్, క్లోజ్డ్ ప్రాంతాల్లోనూ మాస్క్ తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించింది.
అలాగే ఏసీ గదులున్న ప్రాంతాల్లోనూ మాస్క్‌లు ధరించాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో థియేటర్లు, ఆఫీసుల్లోనూ మాస్క్ మస్ట్ కానుంది. అలాగే.. జలుబు లక్షణాలు కనిపించినా, శ్వాస కోశ సంబంధిత సమస్యలు తలెత్తినా.. కరోనా టెస్టులు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
కర్ణాటక వైద్యారోగ్య శాఖ గురువారం సమీక్ష సమావేశం నిర్వహించి.. సీఎం బొమ్మైకి నివేదిక సమర్పించింది. పాజిటివ్ పేషెంట్ల శాంపిల్స్‌ను జీనోమిక్ సీక్వెన్సింగ్‌కు పంపించనున్నట్లు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కే. సుధాకర్ వెల్లడించారు. అన్ని జిల్లాల్లో వైద్య విభాగాలను అప్రమత్తం చేసినట్లు, సరిపడా బెడ్లు, ఆక్సిజన్‌తో సిద్ధంగా ఉండాలని సూచించినట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment