మాలూరు(బెంగళూరు): రుణాల వసూళ్లకు వచ్చిన డీసీసీ బ్యాంకు సిబ్బందిని మహిళలు కర్రలతో అడ్డుకుని బెదిరించిన ఘటన తాలూకాలోని రాజేనహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. మాస్తి ఫిర్కా దిన్నేరి హారోహళ్లి గ్రామ ప్రాథమిక వ్యవసాయ పత్తిన సహకార సంఘం 2023 ఫిబ్రవరిలో రాజేనహళ్లి గ్రామానికి చెందిన ఏడు సీ్త్రశక్తి సంఘాలకు రూ. 5 లక్షల ప్రకారం మొత్తం రూ. 35 లక్షలు వడ్డీ రహిత రుణాలు ఇచ్చారు.
రుణాలు తీసుకున్న మహిళలు ప్రతి నెలా రుణాలు చెల్లిస్తూ వస్తున్నారు. అయితే గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మహిళా స్వసహాయ సంఘాల రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ రుణాలు మాఫీ చేస్తుందనే విశ్వాసంతో మహిళలు ఉన్నారు. దీంతో రుణాల వసూళ్ల కోసం వచ్చిన అధికారులను, సిబ్బందిని ప్రతి గ్రామంలోను మహిళలు అడ్డుకుంటున్నారు.
గతంలో మహిళలు స్వయం ప్రేరితంగా రుణాలు చెల్లించే వారు, అయితే గత నెల రోజుల నుంచి మహిళా సంఘాల సభ్యులు ఎవరూ రుణాలు చెల్లించడానికి ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో రుణాల వసూళ్ల కోసం వెళ్లిన దిన్నేరి హారోహళ్లి సహకార సంఘం కార్యదర్శి తిరుమేగౌడ, గుమాస్తా శ్రీనివాస్, అకౌంటెంట్ చిత్రలను మహిళా సంఘాల సభ్యులు కర్రలతో అడ్డుకుని బెదిరించారు. రుణాలు వసూళ్లకు ఎందుకు వస్తారని సిబ్బందిని నిలదీశారు. ఏం చేస్తారో చేసుకోండని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment