వైరల్: పెళ్లి వేడుకలో జరిగే ఘటనలు సోషల్ మీడియా ద్వారా తరచూ వైరల్ అవుతుండడం చూస్తుంటాం. సరదా నుంచి విషాదాల దాకా.. ప్రతీది వీడియోనో, ఫొటోల రూపంలో ఈరోజుల్లో అందరి చెంతకు చేరుతున్నాయి. అయితే పుత్రోత్సాహం పుత్రుడు పుట్టినప్పటి కంటే.. ఆ పుత్రుడ్ని నలుగురు పొగిడినప్పుడే కలుగుతుందని అంటారు. అయితే.. అది పుత్రుడే అయ్యి ఉండాలా?..
ట్విటర్‌లో ఓ నవవధువు వీడియో దుమ్ము రేపుతోంది. తన పెళ్లిలో తానే సంప్రదాయ వాయిద్యాన్ని వాయిస్తూ హుషారుగా గడిపిందామె. తోటి బృందంతో కలిసి లయబద్ధంగా ఆమె డ్రమ్స్ వాయిస్తూ అక్కడున్నవాళ్లలో జోష్ నింపింది. అది చూసి ఆ తండ్రి ఆనందంతో పొంగిపోయాడు.
సోమవారం త్రిస్సూర్ జిల్లా గురువాయూర్ ఆలయంలో ఒక వివాహం జరిగింది. వధువు తండ్రి కేరళ సంప్రదాయ వాయిద్యం చెండా మాస్టర్. ఆయన పొన్నన్స్ బ్లూ పేరుతో ఒక మ్యూజిక్ ట్రూప్ నడుపుతున్నారు. దీంతో.. తన కూతురి పెళ్లికి ఆయన నేతృత్వంలోనే కార్యక్రమం జరిగింది. తండ్రి అలా డ్రమ్స్ వాయిస్తుంటే.. కూతురు ఊరుకుంటుందా?. వేదిక దిగి.. చండాను భుజాన వేసుకుంది. పెళ్లి కూతురి హుషారు చూసి పెళ్లి కొడుకు కూడా రంగంలోకి దిగాడు.
ఆమె డ్రమ్స్ వాయిస్తుంటే.. అతను చిడతలు వాయిస్తూ బృందంతో కలిశాడు. చివర్లో.. తండ్రి తన కూతురి పక్కన చేరాడు. హుషారుగా తండ్రి బృందంతో కలిసి ఆ వధువు చేసిన హడావిడి నెట్టింట వైరల్ అవుతోంది. అయితే..
ఆ వాయిద్యం ఆమెకు కొత్త కాదు. మెకానికల్ ఇంజినీరింగ్ చదవిన శిల్పా శ్రీకుమార్ 12 ఏళ్లుగా తండ్రి వద్ద చెండా నేర్చుకుంది. దుబాయ్‌లో ఈ కుటుంబం స్థిరపడగా.. ఈ తండ్రీకూతుళ్లు అక్కడ ప్రదర్శనలు కూడా ఇచ్చారట. పొన్నన్స్ బ్లూ మ్యాజిక్ ట్రూప్‌తో కలిసి గతంలో ఓ మలయాళ చిత్రానికి సైతం ఆమె చండా వాయించింది. అయితే తన పెళ్లిలో తాను ప్రదర్శన ఇస్తానని ఆమె ఊహించలేదట.
తండ్రి శ్రీకుమార్ పలియథ్‌తో వధువు శిల్ప, పెళ్లి కొడుకు దేవానంద్(మధ్యలో)
తండ్రిని అలా సంతోషంగా చూసేసరికి.. ఉండబట్టలేక అలా చేశానని అంటోంది శిల్ప. ఇక కూతురి సత్తా తనకు తెలిసినప్పటికీ.. తన పెళ్లిలో తానే స్వయంగా ప్రదర్శన ఇవ్వడం ఎంతో గర్వకారణంగా అనిపిస్తోందని అంటున్నారు శ్రీకుమార్ పలియథ్.
Comments
Please login to add a commentAdd a comment