తిరువనంతపురం: దేశంలో తొలి మంకీపాక్స్ మరణంపై అనుమానాలు వీడాయి. కేరళ త్రిస్సూర్‌కు చెందిన 22 ఏళ్ల యువకుడు మంకీపాక్స్‌తోనే మృతి చెందినట్లు కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. మంకీపాక్స్ అనుమానిత లక్షణాలతో యూఏఈ నుంచి వచ్చిన యువకుడు మృతి చెందాడన్న విషయం తెలిసే ఉంటుంది. అయితే అతనిలో మంకీపాక్స్ వైరస్ నిర్ధారణ అయ్యిందని కేరళ ఆరోగ్య మంత్రి వీణాజార్జ్, రెవెన్యూ శాఖ మంత్రి రాజన్ సోమవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించారు.
యూఏఈ నుంచి జులై 22న సదరు యువకుడు భారత్‌కు తిరిగి వచ్చాడు. ఆపై తన కుటుంబంతో గడిపాడు. స్నేహితులతో ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఆడాడు కూడా. నాలుగు రోజుల తర్వాత అతనికి తీవ్రమైన జ్వరం వచ్చింది. ఆ మరుసటి రోజు..అంటే జులై 27న అతను ఆస్పత్రిలో చేరాడు. జులై 28వ తేదీన అతన్ని వెంటిలేటర్ మీదకు షిఫ్ట్ చేశారు. చికిత్స పొందుతూ.. జులై 30వ తేదీన అతను కన్నుమూశాడు అని తెలిపారు మంత్రి వీణాజార్జ్.
అయితే.. జులై 19వ తేదీన యూఏఈలోనే అతనికి మంకీపాక్స్ టెస్టులు జరిగాయని, భారత్‌కు వచ్చే ముందు రోజు అంటే జులై 21వ తేదీనే పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని మంత్రి వీణాజార్జ్ తెలిపారు. అయితే ఆ యువకుడు విషయాన్ని దాచిపెట్టి.. మామూలుగానే ఉన్నాడని, భారత్‌కు చేరుకుని చివరికి వైరస్ ప్రభావంతో మరణించాడని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు.
వైద్యం సమయంలోనూ అతను తన రిపోర్ట్ వివరాలను వెల్లడించాలేదని, చివరకు మృతుడి శాంపిల్స్‌ను అలప్పుజాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపగా.. జీనోమిక్ సీక్వెన్సింగ్ ద్వారా అతనిలో మంకీపాక్స్ వైరస్ ఉన్నట్లు తేలిందని వీణాజార్జ్ వెల్లడించారు. అయితే కేరళ అధికారిక ప్రకటనపై కేంద్రం స్పందించాల్సి ఉంది. అదే సమయంలో అలపుజ్జా వైరాలజీ సెంటర్ నుంచి శాంపిల్స్‌ను పూణెకు పరీక్షల కోసం పంపింది.
A young boy returned from UAE on July 22, he was with his family when on July 26 he developed a fever & was admitted on July 27. On July 28 he was moved to a ventilator. He got tested on July 19 for monkeypox in UAE, the result of which was positive:Kerala Health min Veena George pic.twitter.com/43VGAtkoB5
— ANI (@ANI) August 1, 2022
కాంటాక్ట్ ట్రేసింగ్..
ప్రొటోకాల్ ప్రకారం.. ప్రస్తుతం హై రిస్క్ జోన్‌లో ఉన్న 20 మందిని ఐసోలేషన్‌లో ఉంచామని, కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, మెడికల్ స్టాఫ్ కూడా అందులో ఉన్నట్లు ఆమె తెలిపారు. వాళ్ల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని ఆమె చెప్పారు. మంకీపాక్స్ బాధితుడు బయట తిరిగాడు. ఫుట్‌బాల్ మ్యాచ్‌లు సైతం ఆడాడు. అంతేకాదు త్రిస్సూర్‌తో పాటు చావక్కాడ్‌లోనూ ప్రైవేట్ ఆస్పత్రుల చుట్టూ అతన్ని తిప్పారని, ఆ కాంటాక్ట్ లిస్టింగ్ కూడా ట్రేస్ చేయాల్సిన అవసరం ఉందని వీణాజార్జ్ వెల్లడించారు.
ఆసియాలో మొదటిది
ఇదిలా ఉంటే.. ప్రపంచంలో ఆఫ్రికాలోనే మంకీపాక్స్ మరణాలు చోటు చేసుకున్నాయి ఇప్పటిదాకా. తాజాగా ప్రపంచంలో తొలి ఆఫ్రికన్‌యేతర దేశంగా బ్రెజిల్‌లో మంకీపాక్స్ మరణం సంభవించింది. ఇమ్యూనిటీ లెవల్ తక్కువగా ఉన్న వ్యక్తి మంకీపాక్స్‌తో చనిపోయాడు కూడా. అలాగే స్పెయిన్‌లో రెండు మరణాలు వెనువెంటనే సంభవించాయి. తాజాగా కేరళ మరణంతో.. ప్రపంచంలో నాలుగో ఆఫ్రికన్‌యేతర మంకీపాక్స్ మరణం భారత్‌లో నమోదు అయ్యింది. అంతేకాదు ఆసియాలోనే తొలి మంకీపాక్స్ మరణానికి భారత్ కేంద్ర బిందువు అయ్యింది. అయితే కేరళ త్రిస్సూర్ యువకుడు కావడం, అతనిలో ఇతర సమస్యలేవీ లేకపోవడం, అంతకు ముందు కూడా వ్యాధులు లేకపోవడంతో కేరళ ఆరోగ్య శాఖతో పాటు కేంద్రమూ అప్రమత్తమైంది.
Comments
Please login to add a commentAdd a comment