బాయ్‌ఫ్రెండ్‌‌ను చంపిన గ్రీష్మకు ఉరిశిక్ష.. కోర్టు సంచలన తీర్పు! | Kerala Court Sentences Girlfriend Greeshma To Death | Sakshi
Sakshi News home page

బాయ్‌ఫ్రెండ్‌‌ను చంపిన గ్రీష్మకు ఉరిశిక్ష.. కోర్టు సంచలన తీర్పు!

Published Mon, Jan 20 2025 3:54 PM | Last Updated on Mon, Jan 20 2025 5:48 PM

Kerala Court Sentences Girlfriend Greeshma To Death

తిరువనంతపురం : ప్రియుడిని చంపిన కేసులో కేరళ కేరళ సెషన్స్‌ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. షరోన్‌ రాజ్‌ ప్రేయసి గ్రీష్మకు ఉరిశిక్ష విధించింది. తీర్పును వెలువరించే సమయంలో ‘ఈ కేసు అరుదైన కేసుల్లోనే అరుదైన కేసు. కాబట్టి ఈ కేసులో వయస్సును పరిగణలోకి తీసుకోకుండా నిందితురాలు గ్రీష్మకు ఉరిశిక్ష విధిస్తున్నాం’ అంటూ కేరళ సెషన్స్‌ కోర్టు తీర్పిచ్చింది. 
 
కేరళ పరసాలలో మూడేళ్ల కిందట(2022లో) సంచలనం సృష్టించిన షరోన్‌ రాజ్‌ హత్య కేసులో  తిరువనంతపురం జిల్లా అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి శుక్రవారం(జనవరి 17న) షరోన్‌ ప్రేయసి గ్రీష్మను, ఆమె మేనమామ నిర్మలాకుమారన్‌ నెయ్యట్టింకర అదనపు సెషన్స్‌ కోర్టు దోషులుగా ప్రకటించారు. సోమవారం (జనవరి 20న) ప్రేయసి గ్రీష్మకు మరణశిక్షను విధిస్తూ తీర్పును వెల్లడించారు. షరోన్‌ను హత్య చేసేలా గ్రీష్మకు సహకరించడంతో పాటు కేసులో కీలక ఆధారాల్ని ధ్వంసం చేసినందుకు ఆమె మేనమామ నిర్మలా కుమారన్‌ నెయ్యట్టింకరకు మూడేళ్ల జైలు శిక్షను  విధించారు. 

నెయ్యట్టింకర అదనపు సెషన్స్ కోర్టు షరోన్‌ రాజ్‌ హత్య కేసును అరుదైన కేసుల్లో అరుదైనదని,అందువల్ల నిందితురాలు గ్రీష్మకు ఉరిశిక్షే సరైందని భావిస్తున్నట్లు తెలిపింది.కాబట్టే వయస్సును పరిగణలోకి తీసుకోలేదని స్పష్టం చేసింది.

సెషన్స్‌ కోర్టు తుదితీర్పు వెలువరించక ముందు గ్రీష్మ తరుఫులు న్యాయవాదులు కోర్టుకు తమ వాదనల్ని వినిపించారు. తన వాదనలలో గ్రీష్మ ఉన్నత విద్యావంతురాలు. చిన్న వయస్సు. తాను మారేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. కానీ కోర్టు డిఫెన్స్‌ లాయర్‌ వాదనల్ని తోసిపుచ్చారు. 

గ్రీష్మ తీరు దారుణం
తీర్పు వెలువరించే సమయంలో అదనపు సెషన్స్‌ కోర్టు గ్రీష్మ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. లైంగిక సాన్నిహిత్యాన్ని సాకుగా చూపి షరోన్‌ను గ్రీష్మను ఆహ్వానించింది. ఆ తర్వాత విషం కలిపిన కషాయాన్ని షరోన్‌ రాజ్‌కు తాపించి, ఆపై దారుణానికి ఒడిగట్టిన గ్రీష్మా చర్యను విస్మరించలేమని పేర్కొంది.

అంతేకాదు, షరోన్‌ కలిసేందుకు వచ్చిన గ్రీష్మా వెంటన విషం కలిపిన కషాయాన్ని తెచ్చుకుంది. ఆ కషాయంపై షరోన్‌ అనుమానం వ్యక్తం చేస్తూ వీడియో రికార్డ్‌ చేయడం, వద్దని గ్రీష్మ వద్దని వారించడం వంటి ఆధారాలు ఉన్నాయి. గ్రీష్మ ఇచ్చిన కషాయం తాగిన షరోన్‌ 11 రోజుల పాటు చుక్క నీరు కూడా తాగకుండా ప్రాణాలతో పోరాడాడు ’ అని కోర్టును ఉటంకిస్తూ జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.  

గ్రీష్మపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు
భారతీయ శిక్షాస్మృతి (IPC) కింద గ్రీష్మపై ఐపీసీ సెక్షన్‌లు 302 (హత్య), 364 (హత్య చేయాలనే ఉద్దేశ్యంతో అపహరణ), 328 (ప్రాణానికి హాని కలిగించే ఉద్దేశ్యంతో విషం ప్రయోగించడం), 203 (తప్పుడు సమాచారం అందించడం ద్వారా న్యాయాన్ని అడ్డుకోవడం) కింద కేసులు నమోదయ్యాయి.  

షారన్ రాజ్ హత్య కేసులో గర్ల్ ఫ్రెండ్ గ్రీష్మకు ఉరిశిక్ష

అసలేం జరిగిందంటే..
పరసాలా ప్రాంతానికి చెందిన షరోన్‌ రాజ్‌(23), గ్రీష్మలు కొన్నాళ్లు ప్రేమించుకున్నారు. అయితే ఆమెకు మరో వ్యక్తితో వివాహాం నిశ్చయమైంది. ఆ తర్వాత షరోన్‌-గ్రీష్మల మధ్య దూరం పెరిగింది. వృత్తి రిత్యా వేరే ఊర్లో ఉంటున్న షరోన్‌.. అక్టోబర్‌ 10న షరోన్‌ పరసాలాకు వచ్చాడు. అక్టోబర్‌ 14న ఉదయం షరోన్‌కు  ఫోన్‌ చేసింది. కలవాలని ఉందని.. బయటకు వెళ్దామని చెప్పింది. దీంతో తన స్నేహితుడితో కలిసి రామవర్మంచిరై(కన్యాకుమారి, తమిళనాడు)లో గ్రీష్మ ఇంటికి వెళ్లాడు షరోన్‌.

స్నేహితుడు బయటే ఎదురుచూస్తుండగా.. ఒక్కడే ఇంట్లోకి వెళ్లాడు. అయితే.. కాసేపటికే పొట్టచేత పట్టుకుని వాంతులు చేసుకుంటూ బయటకు వచ్చాడు షరోన్‌.  దీంతో కంగారుపడ్డ స్నేహితుడు అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆ దారిలోనూ ఇద్దరూ చాట్‌ చేసుకున్నారు. ‘‘కషాయంలో ఏం కలిపావు?’’ అని షరోన్‌ గ్రీష్మను నిలదీశాడు. అయితే తానేం కలపలేదని.. బహుశా వికటించిందేమో అని సమాధానం ఇచ్చిందామె. అక్కడితో వాళ్లిద్దరి ఛాటింగ్‌ ఆగిపోయింది.

నీలిరంగులో వాంతులు చేసుకున్న షరోన్‌ను పరసాలా ప్రభుత్వాసుపత్రిలో చేర్చాడు స్నేహితుడు. ఆపై మెరుగైన వైద్యం కోసం తిరువనంతపురం ప్రభుత్వ మెడికల్‌ కాలేజ్‌ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అయితే.. అక్కడ బ్లడ్‌ టెస్ట్‌ రిపోర్ట్‌లు నార్మల్‌ రావడంతో.. ఇంటికి పంపించేశారు. రెండు రోజుల తర్వాత షరోన్‌ పరిస్థితి విషమించింది. దీంతో తిరిగి తిరువనంతపురం ప్రభుత్వ మెడికల్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్సలో షరోన్‌కు లంగ్స్‌, కిడ్నీ ఒక్కొక్కటిగా దెబ్బ తింటూ వచ్చాయి. ఈలోపు షరోన్‌ నుంచి మెజిస్ట్రేట్‌ సమక్షంలో వాంగ్మూలం సేకరించారు పోలీసులు. మరోవైపు వైద్యులు.. అతను తాగిన డ్రింక్‌లో పురుగుల మందు కలిసిందని నిర్ధారించుకున్నారు. అవయవాలన్నీ పాడైపోయి అక్టోబర్‌ 25వ తేదీన గుండెపోటుతో షరోన్‌ ప్రాణం విడిచాడు.

ఎస్కేప్‌.. అరెస్ట్‌..
తమ బిడ్డ చావుకు గ్రీష్మ కుటుంబం కారణమంటూ షరోన్‌ పేరెంట్స్‌ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న ఆ కుటుంబం కోసం గాలించారు. చివరకు.. అదే ఏడాది నవంబర్‌ 22న గ్రీష్మ కుటుంబాన్ని అరెస్ట్‌ చేశారు. అయితే  పీఎస్‌లో ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించడం నాటకీయ పరిణామాలకు దారి తీసింది.

వాదనలు ఇలా.. 
ఇది అత్యంత అరుదైన కేసు అని ప్రాసిక్యూషన్‌ వాదించారు. ఆమె కేవలం ఓ యువకుడ్ని మాత్రమే చంపలేదు. ప్రేమ అనే భావోద్వేగాన్ని ప్రదర్శించి ఓ ప్రాణం బలి తీసుకుంది. అనుకున్న ప్రకారమే.. ఆమె ప్రేమను అడ్డుపెట్టి మరీ అతన్ని తన ఇంటికి రప్పించి ఘోరానికి తెగబడింది. అతని చంపడానికి ఆమె అన్నివిధాల ప్రయత్నించింది. ఆస్పత్రిలో చికిత్స పేరిట 11 రోజులపాటు అతను నరకం అనుభవించాడు. ఇదేదో హఠాత్తుగా జరిగింది కాదు. షరోన్‌ కూడా ఎన్నో కలలు కన్నాడు. కానీ, గ్రీష్మ వాటిని చెరిపేసింది. కాబట్టి, ఆమెపై కనికరం చూపించాల్సిన అవసరం లేదు. ఆమెకు ఉరే సరి అని వాదించారు.

మరోవైపు.. గ్రీష్మ తరఫున వాదనలు వినిపించిన లాయర్‌ అజిత్‌ కుమార్‌.. కేసులో వాస్తవ ఆధారాలు(Circumstantial Evidence) లేనప్పుడు మరణశిక్ష విధించడం కుదరని వాదించారు. ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలో గ్రీష్మ ఆత్మహత్యకు ప్రయత్నించింది. వాస్తవానికి ఆమె షరోన్‌ నుంచి బయటపడేందుకు ప్రయత్నించింది. కానీ, ఆ యువకుడు ఆమెను వదల్లేదు. వ్యక్తిగత చిత్రాలు చూపించి బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. బెడ్‌రూం వీడియోలు బయటపెడతానని బెదిరించాడు. మానసికంగా ఆమెను ఎంతో వేధించాడు. అలాంటప్పుడు ఏ మహిళ అయినా ఎందుకు ఊరుకుంటుంది. ఆమె మెరిట్‌ విద్యార్థిని. శిక్ష విషయంలో కనికరం చూపించాల్సిందే’’ అని వాదించారు.

దాదాపు రెండేళ్లపాటు ఈ కేసు విచారణ జరిగింది. చివరకు.. జనవరి 17వ తేదీన గ్రీష్మను, ఆమె మేనమామ నిర్మలాకుమారన్‌ను దోషులుగా నిర్ధారించింది. అదే సమయంలో గ్రీష్మ తల్లి సింధును నిర్దోషిగా ప్రకటించి విడుదల చేసింది. 

మూఢనమ్మక కోణం!
మూఢనమ్మకంతో గ్రీష్మ కుటుంబం తమ బిడ్డ ప్రాణం తీసిందని షరోన్‌ కుటుంబం ఆరోపించింది. ఆమెకు ఎంగ్మేజ్‌మెంట్‌ అయ్యాక మనసు విరిగిన షరోన్‌.. తన పనిలో తాను ఉన్నాడని, గ్రీష్మానే ఫోన్‌ చేసి అతన్ని పరసాలాకు రప్పించిందన్నారు. ‘‘గ్రీష్మ కుటుంబానికి షరోన్‌ రాజ్‌ నచ్చలేదు. అందుకే మరో వ్యక్తితో ఆమెకు పెళ్లి ఫిక్స్‌ చేసి.. ఎంగేజ్‌మెంట్‌ కూడా కానిచ్చేశారు. ఆపై పెళ్లిని అర్ధాంతరంగా వాయిదా వేశారు. అయితే.. గ్రీష్మకు పెళ్లైన వెంటనే భర్త మరణించే గండం ఉంది. ఆ దోషం పొగొట్టేందుకు షరోన్‌ను బలి పశువును చేశారు. బలవంతంగా ఆమె నుదుట కుంకుమ పెట్టించారు.  ఇంటి నుంచి బయటకు వచ్చిన షరోన్‌ నుదుటిపై కూడా కుంకుమ ఉందని, ఆ విషయాన్ని వెంట ఉన్న స్నేహితుడు సైతం నిర్ధారించాడని అంటోంది. పక్కా ప్లాన్‌తో ఆమెతో బలవంతపు వివాహం జరిపించి.. ఆపై పురుగుల మందు తాగించి షరోన్‌ మరణానికి కారణమయ్యారని ఆరోపిస్తూ వచ్చింది. అయితే పోలీసులు ఈ వాదనను తోసిపుచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement