కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్
తిరువనంతపురం: కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ పేరు ఈ రోజు ఉదయం నుంచి సోషల్ మీడియా, మీడియాలో తెగ వైరలవుతోంది. కారణం ఏంటంటే ఆయన వరకట్నాకి వ్యతిరేకంగా ఒక్క రోజు నిరాహార దీక్ష చేశారు. ఆరిఫ్ మహమ్మద్ ఖాన్.. తిరువనంతపరంలోని తన కార్యాలయంలో ఈ నిరసన దీక్షకు కూర్చున్నారు. ఇటీవల కేరళలో వెలుగు చూసిన వరకట్న వేధింపులు కేసుపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేరళలో పలు ప్రజా సంఘాలు వరకట్నానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేపట్టాయి. గాంధీ భవన్‌లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. వారికి సంఘీభావంగా గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ కూడా రాజ్‌భవన్‌లో దీక్షకు కూర్చున్నారు. వరకట్నం గురించి ప్రజల్లో అవగాహన తెచ్చేందుకే ఆయన దీక్ష చేస్తున్నట్లు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి.
ఈ సందర్భంగా ఖాన్ మాట్లాడుతూ.. ‘‘అక్షరాస్యలో ముందున్న మన రాష్ట్రానికి ఇది ఎంతో సిగ్గుచేటు. వరకట్నం తీసుకోవడం, ఇవ్వడం నేరం. అలా చేస్తే ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. మన రాష్ట్రాభివృద్ధిలో మహిళలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాంటి మహిళల గౌరవానికి వరకట్నం భంగం కలిగిస్తుంది. ఏ యువకుడైనా తన పెళ్లికి కట్నం డిమాండ్ చేస్తే అతడు చదువును, దేశాన్ని అవమానించినట్లేనని గాంధీజీ చెప్పారు. ఎవరూ కట్నం తీసుకోబోమని యువత ప్రతిజ్ఞ చేయాలి. వరకట్న వేధింపులకు ముగింపు పలకాలి’’ అని మహమ్మద్ ఆరిఫ్ ఖాన్ పేర్కొన్నారు.
వరకట్నానికి వ్యతిరేకంగా ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఖాన్ అభిప్రాయపడ్డారు. మహిళల గౌరవానికి సంబంధించి కేరళ ప్రభుత్వం చేపట్టిన స్త్రీపక్ష కేరళం కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఉదయం 8 గంటలకు దీక్ష ప్రారంభించిన ఆయన 6 గంటలకు విరమించారు. సాయంత్రం 5 గంటలలకు గాంధీ భవన్‌కు వెళ్లి.. వరకట్నానికి వ్యతిరేకంగా దీక్ష చేపట్టిన ప్రజా సంఘాలను మద్దతు తెలిపారు. గవర్నర్ ఇలా వరకట్నానికి వ్యతిరేకంగా దీక్ష చేయడం పట్ల జనాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment