తిరువనంతపురం: కేరళ వరుస పేలుళ్ల కేసులో డొమినిక్ మార్టిన్ అనే వ్యక్తిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పేలుడుకు బాధ్యత వహిస్తున్నట్లు నిందితుడు ప్రకటించిన ఒక రోజు తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం, పేలుడు పదార్థాల చట్టం, హత్యా నేరాల కింద అతడిని సోమవారం అరెస్టు చేశారు. కన్వెన్షన్ సెంటర్‌లో బాంబులు పెట్టినట్లు మార్టిన్ ఒప్పుకుని త్రిసూర్ జిల్లాలో పోలీసులకు లొంగిపోయాడు.
లొంగిపోయే ముందు మార్టిన్ ఫేస్‌బుక్‌లో ఒక వీడియోను విడుదల చేశాడు. యోహూవా క్రిస్టియన్ శాఖ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన సమావేశంలో వరుస పేలుళ్లను ఎందుకు పాల్పడ్డాడో వివరించాడు. క్రిస్టియన్ శాఖ (యెహూవా సాక్షులు) బృందంతో తనకు కొన్నేళ్లుగా సంబంధం ఉందని పేర్కొన్న మార్టిన్.. వారి బోధనలతో మాత్రం ఏకీభవించలేదు. వారి బోధనలు తప్పుడు మార్గంలో ఉన్నాయని పలుమార్లు హెచ్చరించినట్లు కూడా చెప్పాడు. వారి బోధనలు దేశ వ్యతిరేకమని తెలిపిన మార్టిన్.. బోధనల్లో మార్పును కోరుకున్నట్లు చెప్పుకొచ్చాడు. కానీ అందుకు వారు సిద్ధంగా లేదని స్పష్టం చేశాడు. ఈ కారణంగానే తాను పేలుళ్లకు పాల్పడ్డట్లు వెల్లడించాడు.
కేరళ రాష్ట్రం ఎర్నాకుళంలోని కొచ్చి నగర సమీపంలో వరుస పేలుళ్ల ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. మతపరమైన వేడుక జరుగుతున్న కన్వెన్షన్ సెంటర్‌లో చోటుచేసుకున్న ఈ పేలుళ్లలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో 51 మంది గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మూడు రోజులుగా జరుగుతున్న ఈ వేడుకల ముగింపు కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక ప్రార్థనల్లో వేలాది మంది పాల్గొన్న కలామాస్సెరీలోని జామ్రా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ పేలుళ్లు జరిగాయి.
ఇదీ చదవండి: Kerala Blast: కేరళలో వరుస పేలుళ్లు
Comments
Please login to add a commentAdd a comment