ఆ స్కూల్‌లో బాలబాలికల​కు యూనిఫామ్‌ ఒకటే! | Kerala School Introduces Gender Neutral Uniform Wins Laurels | Sakshi
Sakshi News home page

ఆ స్కూల్‌లో బాలబాలికల​కు యూనిఫామ్‌ ఒకటే!

Published Thu, Nov 18 2021 11:51 AM | Last Updated on Thu, Nov 18 2021 11:56 AM

Kerala School Introduces Gender Neutral Uniform Wins Laurels - Sakshi

సాధారణంగా పాఠశాలల్లో బాలురు, బాలికల​కు వేర్వేరుగా యూనిఫామ్స్‌ ఉంటాయి. కానీ ఆ స్కూల్‌లో మాత్రం బాలురు, బాలికల​కు ఒకేరకమైన యూనిఫామ్‌ ఉంటుంది. ఈ పాఠశాల మన దేశంలోనే ఉందంటే ఆశ్చర్యం కలగక మానదు. లింగ సమానత్వాన్ని ప్రబోధించేందుకే బాల బాలికల​కు ఒకే రకమైన ఏకరూప దుస్తుల ధరించేలా చేస్తున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికుల సహకారంతో ఈ నిశ్శబ్ద విప్లవానికి తొలి అడుగుపడింది. 

విద్యార్జనలో అగ్రస్థానాన ఉన్న కేరళలోనే ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. ఎర్నాకులం జిల్లాలో వలయన్చిరంగార ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిశ్శబ్ద విప్లవానికి అంకుర్పారణ జరిగింది. లింగ భేదం లేకుండా ఇక్కడ విద్యార్థులందరూ ఒకే రకమైన యూనిఫామ్‌ ధరిస్తారు. చొక్కాలు, త్రిబైఫోర్త్‌ షార్ట్స్‌ వేసుకుని చదువులమ్మ ఒడిలో ఒదిగిపోతున్నారు. బాలికలు ఎటువంటి సంకోచం లేకుండా స్వేచ్ఛగా ఆటపాటలతో చదువుకుంటున్నారు. (ఆడపిల్లంటే ఇలా ఉండాలి.. సమాజం అంత అందమైనదేం కాదు!!)

వలయన్చిరంగార ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రీ-ప్రైమరీ, లోయర్ ప్రైమరీ విభాగాలు ఉన్నాయి. రెండు విభాగాల్లో మొత్తం 746 మంది విద్యార్థులు ఉన్నారు. లింగ సమానత్వ యూనిఫామ్‌ మొదట 2017లో ప్రీ-ప్రైమరీ విద్యార్థుల కోసం ప్రవేశపెట్టారు. ఇది ఇప్పుడు 1 నుంచి 4 తరగతులకు విస్తరించారు. 

లింగ సమానత్వ యూనిఫామ్‌ ప్రవేశపెట్టడానికి ముందు బాలికలు ఆటలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంకోచించే వారని.. ఇప్పుడు వారిలో ఎటువంటి సంకోచం లేదని ఉపాధ్యాయురాలు సి.రాజీ తెలిపారు. తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చర్చించిన తర్వాత జెండర్‌ న్యూట్రల్‌ యూనిఫామ్‌ అమలు చేశామన్నారు. ‘బాలికలకు ఇబ్బందిగా ఉన్న డ్రెస్ కోడ్ మార్చాల్సిందేనని విద్యార్థినుల తల్లులు బలంగా విశ్వసించారు. తమ కుమార్తెలు తాము ధరించే యూనిఫామ్‌లో సురక్షితంగా ఉండాలని వారు కోరుకున్నారు. కొత్త యూనిఫామ్‌ అదనపు ఖర్చును భరించడానికి వారు ముందుకు వచ్చార’ని రాజీ వెల్లడించారు. 


‘లింగ సమానత్వ ఏకరూప దుస్తులు ప్రవేశపెట్టడం వల్ల అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఎక్కువ మంది బాలికలు క్రీడల్లో పాల్గొనేందుకు ముందుకు వస్తుండటం ఇందుకు నిదర్శనం. కొత్త డ్రెస్ కోడ్ వారికి గొప్ప స్వేచ్ఛను అందించింది. మా పాఠశాలలో 378 మంది బాలికలు ఉన్నారు. వీరిలో అత్యధికులు పేదవారే. కానీ తల్లిదండ్రులు కొత్త యూనిఫామ్‌ కోసం అదనంగా డబ్బులు చెల్లించడానికి అంగీకరించారు. అమ్మాయిలు చాలా హ్యాపీగా ఉన్నార’ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కేపీ సుమ అన్నారు. 2019లోనే  జెండర్‌ న్యూట్రల్‌ యూనిఫామ్‌ ప్రవేశపెట్టాలని అనుకున్నప్పటికీ కరోనా కారణంగా కాస్త ఆలస్యమైందని తెలిపారు. 

కొత్త డ్రెస్ కోడ్ ప్రవేశపెట్టడంతోనే ఆగిపోలేదు.. విద్యార్థుల కోసం జెండర్‌-సెన్సిటివ్ పాఠాలను కూడా సిద్ధం చేశారు ఉపాధ్యాయులు. బాలురు, బాలికలు ఇద్దరూ సమానమే అని చెప్పేవిధంగా పాఠాలు బోధిస్తున్నట్టు అకడమిక్ కమిటీ చైర్మన్ డాక్టర్ బినోయ్ పీటర్ చెప్పారు. లింగ సమానత్వ మాడ్యూల్‌ను ప్రోత్సహించేందుకు తాము ప్రయత్నం చేస్తున్నామన్నారు. కాగా, వలయన్చిరంగార పాఠశాల చేపట్టిన ఈ ప్రయత్నాన్ని కేరళ విద్యా మంత్రి ఆర్ బిందు, సినీ నటి మంజు వారియర్, ఒలింపియన్ అంజు బాబీ జార్జ్ సహా పలువురు ప్రముఖులు ప్రశంసించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement