జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో సాయుధ ఉగ్రవాదులు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. రెండు సైనిక వాహనాలపై మెరుపుదాడి చేశారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సురాన్‌కోట్ పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం మధ్యాహ్నం 3.45 గంటలకు ఈ దాడి జరిగింది. గాలింపు చర్యల కోసం వెళ్తున్న సైనిక వాహనాలపై దత్యార్‌మోర్హ్ వద్ద ముష్కరులు దాడి చేశారు. ఒక ట్రక్కు, మరో జిప్సీపై తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మృతిచెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు.
కాగా ఉగ్రదాడికి సంబంధించి పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పూంచ్‌లో జరిగిన ఉగ్రదాడికి తామే బాధ్యులమని పాకిస్తాన్ ఆధారిత తీవ్రవాద సంస్థ లష్కరే తోయిబా అనుబంధ యాంటీ–ఫాసిస్ట్ ఫ్రంట్(పీఏఎఫ్‌ఎఫ్) ప్రకటించింది. గతంలో కూడా ఈ సంస్థ దాడులకు పాల్పడింది. 2019లో జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా(ఆర్టికల్ 370) రద్దు చేసిన తర్వాత తమ కార్యకలాపాలను ప్రారంభించింది.
ఇటీవలి కాలంలో జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా బలగాలు, పౌరులపై జరిగిన ఉగ్రదాడుల్లో చాలా వరకు పీఏఎఫ్‌ఎఫ్ చేసినవే. ఈ అటాక్‌లో ఉగ్రవాదులు అమెరికా తయారీ రైఫిళ్లు 4 కార్బైన్‌ను ఉపయోగించారు. దాడికి పాల్పడిన ఆయుధాలతో ఉగ్రవాదులు సోషల్ మీడియాలో ఫోటోలు విడుదల చేశారు. M4 కార్బైన్ అనేది 1980లలో యూఎస్‌లో అభివృద్ధి చేశారు. గ్యాస్ ఆపరేటెడ్, తేలికపాటి మ్యాగజైన్ ఫెడ్ కార్బైన్. ఇది అమెరికా సాయుధ దళాల ఆయుధం. ప్రస్తుతం దీనిని 80కి పైగా దేశాల్లో వాడుతున్నారు. పలు తీవ్రవాద సంస్థలు ఈ ఆయుధాన్ని వాడుతున్నాయి.
వారు దాడులను రికార్డు చేసేందుకు బాడీ కెమెరాలను ఉపయోగిస్తుంటారు. ఆ తర్వాత ఈ వీడియోలను తమ సంస్థను ప్రచారం చేసేందుకు ఉపయోగించుకుంటాయి. ఈ విధంగానే ఈ ఏడాది ఏప్రిల్‌లో పూంచ్‌లో ఆర్మీ ట్రక్కుపై పీఏఎఫ్ఎఫ్ దాడి చేసి వీడియో తీసింది. దాడిలో మరణించిన సైనికుల ఆయుధాలతో ఉగ్రవాదులు ఆ ప్రాంతం నుంచి పారిపోతున్నట్లు చూపించిన వీడియోను తరువాత విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment