సియోల్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ రష్యాకు పయన మయ్యారు. ఆయన తన సొంత బుల్లెట్ ప్రూఫ్ రైలులో ఆదివారం సాయంత్రం రాజధాని ప్యాంగాంగ్ వదిలివెళ్లారని దక్షిణ కొరియా వర్గాలు తెలిపాయి. మూడు రోజులపాటు జరిగే ఒక అంతర్జాతీయ సమావేశంలో పాల్గొనేందుకు పుతిన్ సోమవారం వ్లాడివోస్టోక్ వెళ్లారని, అక్కడే ఆయనతో కిమ్ సమావేశమవ్వొచ్చని చెబుతున్నారు.
కిమ్ తమ దేశానికి వస్తున్నారంటూ రష్యా కూడా సోమవారం ధ్రువీకరించింది. అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు త్వరలో కిమ్ రానున్నారని క్రెమ్లిన్ అధికార వెబ్‌సైట్ పేర్కొంది. పుతిన్, కిమ్‌లు త్వరలో కలుసుకుంటారని ఉత్తరకొరియా అధికార వార్తా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ కూడా తెలిపింది. ‘రష్యా పర్యటనలో కామ్రెడ్ కిమ్ జొంగ్ ఉన్, కామ్రెడ్ పుతిన్‌తో చర్చలు జరుపుతారు’అని పేర్కొంది. అయితే, ఈ భేటీ ఎప్పుడు, ఎక్కడ ఉంటుందనే వివరాలు మాత్రం వెల్లడించలేదు.
కిమ్ విదేశీ పర్యటనలకు వినియోగించే ఆకుపచ్చ బోగీలతో కూడిన బుల్లెట్ ప్రూఫ్ రైలును రష్యా సరిహద్దుల్లోని ఉత్తరకొరియా రైల్వే స్టేషన్‌లో ఉండగా గుర్తించినట్లు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. ఉక్రెయిన్‌తో ఏడాదిన్నరగా కొనసాగుతున్న యుద్ధానికి అవసరమైన ఆయుధాల కొనుగోలుకు కిమ్‌తో పుతిన్ ఒప్పందం కుదుర్చుకునేందుకు అవకాశాలున్నాయన్నది పశ్చిమదేశాల అంచనా. కోవిడ్ మహమ్మారి ప్రబలిన దాదాపు నాలుగేళ్ల తర్వాత కిమ్ మొట్టమొదటి విదేశీ పర్యటన ఇదే.
రైలులోనే ఎందుకు?
గతంలో 2019లో మొదటిసారిగా వ్లాడివోస్టోక్‌లో పుతిన్‌తో సమావేశమైనప్పుడు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లతో సమావేశాలకు రైలులో వెళ్లినట్లుగానే ఈసారీ కిమ్ రష్యాకు రైలులోనే బయలుదేరారు. సొంత రైలులోనే విదేశీ పర్యటనలు చేసిన దివంగత పాలకుడు, తన తండ్రి పాటించిన సంప్రదాయాన్ని కిమ్ కూడా కొనసాగిస్తున్నారు. ఈ రైలుకు 20 బుల్లెట్ ప్రూఫ్ బోగీలుంటాయి. దీనివల్ల సాధారణ రైళ్ల కంటే ఇది ఎక్కువ బరువుంటుంది. సరాసరిన గంటకు 59 కిలోమీటర్లకు మించి వేగంతో ఇది ప్రయాణించలేదు. ఈ వేగంతో ప్యాంగ్యాంగ్ నుంచి వ్లాడివోస్టోక్‌కు వెళ్లడానికి ఒక రోజంతా పడుతుంది.
రష్యాకు రైల్లో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్
Published Tue, Sep 12 2023 5:36 AM | Last Updated on Tue, Sep 12 2023 8:19 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment