న్యూఢిల్లీ: ‘‘సుప్రీంకోర్టు అడ్వకేట్‌గా పనిచేస్తున్న సమయంలో నెలసరి వచ్చిన మొదటి రోజు నేను సెలవు అడిగాను . దాంతో నా సుపీరియర్ నన్ను ఉద్యోగం నుంచి తీసివేశారు. అంతేకాదు కేవలం ఈ కారణం వల్లే మహిళలను తన జూనియర్లుగా నియమించుకోనని చెప్పారు. అంతేకాదు కోర్టు రూంలో సీనియర్లు ముఖ్యంగా పురుష న్యాయవాదుల ముందు నేను కూర్చోవడాన్ని వాళ్లు అగౌరవంగా భావించేవారు’’ అంటూ తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి ప్రముఖ న్యాయవాది, తమిళనాడుకు చెందిన హక్కుల కార్యకర్త కిరుబ మునుస్వామి సోషల్ మీడియాలో పంచుకున్నారు.
అదే విధంగా చాలా వరకు వస్త్ర పరిశ్రమలు మహిళలకు నెలసరి సమయంలో సెలవు ఇవ్వవని, పని సజావుగా సాగేందుకు వీలుగా వారు మాత్రలు మింగేలా విధిలేని పరిస్థితులు కల్పిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల్లో ముఖ్యంగా దళిత, వెనుకబడిన వర్గాల మహిళలే ఉండటం విచారకరమని.. యాజమాన్యాల లాభాపేక్ష కారణంగా వారు ఆరోగ్యకర జీవితాన్ని గడిపే వీలులేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
జొమాటో ‘పీరియడ్ లీవ్’
‘‘ఇక మీదట మా సంస్థలో పని చేసే మహిళా ఉద్యోగులు సంవత్సరానికి పది రోజులు పిరియడ్ లీవ్ తీసుకోవచ్చు’’ అని ప్రఖ్యాత ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సీఈఓ దీపెందర్ గోయల్ ఇటీవల తన ఉద్యోగులను ఉద్దేశించి లేఖ రాసిన విషయం తెలిసిందే. ‘‘ప్రియమైన మగ ఉద్యోగులూ... మన సంస్థలో పని చేసే మహిళా ఉద్యోగులు పిరియడ్ లీవ్ పెట్టినప్పుడు వారి పరిస్థితిని అర్థం చేసుకొని సహకరించండి. తమకు విశ్రాంతి కావాలి అని చెప్పినప్పుడు మనం వారిని నమ్మాలి. నేను మహిళా ఉద్యోగులకు ఈ సౌలభ్యం కలిపిస్తున్నది బహిష్టు గురించి మనకు ముందు నుంచి ఉన్న పాతకాలపు భావనలు, నిషిద్ధ అభిప్రాయాలు సమసిపోవడానికే’’తన నిర్ణయం వెనుక ఉద్దేశాన్ని కూడా ఆయన స్పష్టంగా వివరించారు. (మహిళా ఉద్యోగులకు పది రోజుల ‘పిరియడ్ లీవ్’)
పెళ్లికి నెల, ప్రసూతికి ఆర్నెళ్లు
ఈ నేపథ్యంలో పీరియడ్స్ కారణంగా పనిచేసే చోట మహిళలకు ఎదురవుతున్న ఇబ్బందులు, సెలవులు దొరకక పడే వర్ణనాతీత బాధల గురించి పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. వీరిలో కురుబ మునుస్వామి కూడా ఒకరు. తమిళనాడులోని సేలంకు చెందిన ఆమె తాను మహిళను అందునా దళితురాలిని అయిన కారణంగా ఎదుర్కొన్న వివక్ష గురించి ఓ జాతీయ మీడియాతో పంచుకున్నారు. ‘‘ఆడవాళ్లు నెలసరి తొలినాడు కచ్చితంగా సెలవు అడుగుతారు. పెళ్లి చేసుకుంటే ఓ నెల, గర్భం దాలిస్తే మరో ఆర్నెళ్లు ఇలా సెలవులు ఇస్తూనే పోవాలి. అందుకే తాను మహిళలను జూనియర్లుగా చేర్చుకోనని నా సుపీరియర్ చెప్పారు. ఇక నన్నేమో దళిత మహిళ అనే కారణంగా దయ, కరుణతో తన వద్ద పనిచేసే అవకాశమిచ్చానన్నారు.
మరొక సీనియర్ సర్వోన్నత న్యాయస్థానంలో పనిచేసే అర్హత నాకు లేదని, ఓ పెళ్లికొడుకును చూసి వెంటనే వివాహం జరిపించేయమని మా అమ్మను అడగాలని సలహా ఇచ్చారు. నిజానికి వాళ్లిద్దరికీ కూతుళ్లు ఉన్నారు. మరి ఎందుకో మరో స్త్రీ పట్ల వారికి ఆ అభిప్రాయం ఉంది. ఇంకో విషయం ఏమిటంటే అన్ని రంగాల మాదిరిగానే న్యాయ వ్యవస్థలో కూడా బంధుప్రీతి ఉంది. మా కుటుంబం నుంచి నేను మొదటి తరం లాయర్‌ను. కానీ నా చుట్టూ పనిచేసే ఎంతో మంది మహిళా లాయర్ల బంధువులు అప్పటికే న్యాయవాదులుగా ఉన్నారు. దళిత మహిళలు ఇప్పటికే అణచివేతకు గురవుతుంటే, నెలసరి సమయంలో ఇలాంటి అవమానాలు వారిని కుంగుబాటుకు లోనయ్యేలా చేస్తాయి’’ అని పేర్కొన్నారు.
పెళ్లి చేసుకో, పిల్లలను కను.. అప్పుడే
అంతేగాక నేటికీ సమాజంలో నెలసరి గురించి మాట్లాడాలన్నా, ఆ సమయంలో కలిగే ఇబ్బందుల గురించి డాక్టర్లతో నిస్సంకోచంగా మాట్లాడే పరిస్థితులు లేవని కిరుబ అభిప్రాయపడ్డారు. ‘‘నేను దాదాపు 30 మంది వైద్యులను సంప్రదించాను. పీరియడ్స్ కారణంగా నాకు కలిగే బాధ గురించి చెప్పాను. వాళ్లంతా నాకు ఒకటే మాట చెప్పారు. పెళ్లి చేసుకో, పిల్లల్ని కను అప్పుడే అంతా సవ్యంగా ఉంటుందని. అన్ని బాధలు తొలగిపోతాయని చెప్పారు. భారత వైద్యుల మెంటాలిటీ ఇంతకంటే మెరుగ్గా ఉండదేమో. అందుకే చాలా మంది అమ్మాయిలు ఇటువంటి విషయాల్లో వెనకంజ వేస్తారేమో’’అని తనకు ఎదురైన అనుభవాల గురించి చెప్పుకొచ్చారు.
ఇక జొమాటో సీఈఓ ‘పీరియడ్ లీవ్’నిర్ణయం నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా మహిళా న్యాయవాదులు, న్యాయమూర్తులకు ఇలాంటి సౌలభ్యం కల్పిస్తుందా అని ప్రశ్నించగా.. లైంగిక వేధింపుల వంటి తీవ్రమైన సమస్యల గురించి ఇప్పుడిప్పుడే కొంతమంది మాట్లాడుతున్నారని, అలాంటి వారికి ఈ విషయం చాలా చిన్నగా కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. బార్ కౌన్సిల్ ఈ అంశంపై చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
కాగా కిరుబ మునుస్వామి తన సోషల్ మీడియా అకౌంట్లో ఇందుకు సంబంధించిన విషయాలను ప్రస్తావిస్తూ... దళిత మహిళ నెలసరి అనుభవం(#DalitWomanMenstrualExperience)పేరిట హ్యాష్‌ట్యాగ్ జతచేయడంతో కొంతమంది పురుషులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని కులంతో ముడిపెట్టవద్దని, నెలసరి సమస్యలు కేవలం దళిత మహిళలకే పరిమితం కావని, అందరు స్త్రీలకు వర్తిస్తాయని విమర్శలు గుప్పిస్తున్నారే తప్ప... సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన, అణచివేయబడిన వర్గంలో స్త్రీలు మరింత వివక్షకు గురవుతున్నారనే నిజాన్ని వాళ్లు గుర్తించడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment