న్యూఢిల్లీ: ఆర్‌జేడీ చీఫ్, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ కుటుంబసభ్యుల నివాసాల్లో శుక్రవారం జరిపిన సోదాల్లో దొరికిన నగలు, నగదు, వెల్లడైన పత్రాలను బట్టి నేర విస్తృతి రూ.600 కోట్లకు పైగానే ఉంటుందని ఈడీ తెలిపింది. లాలూ కుటుంబసభ్యుల ఇళ్లలో లెక్కల్లో చూపని రూ.కోటి నగదు, రూ.1.25 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ, బంగారం, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొంది.
వీటితోపాటు, లాలూ కుటుంబసభ్యుల పేరిట ఉన్న సేల్ డీడ్స్, ఆస్తి పత్రాలు దితరాలను స్వాధీనం చేసుకున్నామని, వీటిని బట్టి నేర విస్తృతి రూ.600 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు శనివారం వెల్లడించింది. వీటిల్లో రూ.350 కోట్లు స్థిరాస్తులు కాగా, రూ.250 కోట్ల మేర బినామీదార్ల పేరిట లావాదేవీలు ఉన్నాయంది. తేజస్వీ యాదవ్ ఆస్తుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన ఈడీ.. ఢిల్లీలోని న్యూఫ్రెండ్స్ కాలనీలోని ఏబీ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఉన్న డి–1088 నాలుగంతస్తుల భవనం తేజస్వీదేనని తెలిపింది. ఈ కేసులో ఈ కంపెనీని ‘లబ్ధిపొందిన సంస్థ’గా గుర్తించినట్లు వెల్లడించింది.
మార్కెట్ విలువ ప్రకారం రూ.150 కోట్లకుపైగా విలువైన ఈ భవనాన్ని తేజస్వీ, ఆయన కుటుంబం కేవలం రూ.4 లక్షలకే పొందినట్లు ఈడీ ఆరోపించింది. ఇలాంటివే మరో నాలుగు ఆస్తులను గుర్తించామని తెలిపింది. రైల్వే జాబ్స్ ఫర్ లాండ్ కుంభకోణంపై తమ దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొంది. ఈ కేసులో మనీలాండరింగ్ ఆరోపణల్లో భాగంగా లాలూ కుటుంబీకులు, వారి సంబంధీకులు రియల్ ఎస్టేట్ వంటి వివిధ రంగాల్లో వేర్వేరు ప్రాంతాల్లో పెట్టిన మరిన్ని పెట్టుబడులను కూడా వెలికితీస్తామని తెలిపింది. లాలూ ముగ్గురు కుమార్తెలు, కుమారుడు బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీయాదవ్‌కు చెందిన వేర్వేరు ప్రాంతాల్లో శుక్రవారం ఈడీ అధికారులు సోదాలు జరిపిన విషయం తెలిసిందే.
సీబీఐ విచారణకు తేజస్వీ గైర్హాజరు
ఇదే కేసులో తేజస్వీ యాదవ్ శనివారం సీబీఐ విచారణకు హాజరుకాలేదు. వ్యక్తిగత కారణాలు చూపుతూ విచారణకు మరో తేదీని నిర్ణయించాలని ఆయన కోరినట్లు అధికారులు తెలిపారు. సీబీఐ సమన్ల ప్రకారం ఈ నెల 4వ తేదీన జరగాల్సిన విచారణకూ తేజస్వీ డుమ్మా కొట్టారు. తేజస్వీ కోరిన విధంగా విచారణకు మరో తేదీని నిర్ణయించే అవకాశముందని అధికారులు తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ ఆర్జేడీ చీఫ్, మాజీ సీఎం లాలూ యాదవ్, ఆయన భార్య మాజీ సీఎం రబ్రీదేవిని సీబీఐ ప్రశ్నించిన విషయం తెలిసిందే.
లాలూ రైల్వే శాఖ మంత్రిగా ఉండగా కొందరు అభ్యర్థులకు ఉద్యోగాలిచ్చినందుకు ప్రతిఫలంగా ఉచితంగా లేక తక్కువ ధరకు భూములను పొందినట్లు సీబీఐ ఆరోపణలు చేస్తోంది. లాలూ కుటుంబం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తోంది. జేడీయూ అగ్రనేత, బిహార్ సీఎం నితీశ్ కుమార్ కూడా తేజస్వీ వాదనను సమర్థించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న ప్రయత్నమే సీబీఐ విచారణ అంటూ విమర్శించారు. అయితే, 2017లో నితీశ్..లాలూపై దర్యాప్తు సంస్థలు చేసిన అవినీతి ఆరోపణలను సమర్థిస్తూ మాట్లాడటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment