కూలీగా మారిన ఆనాటి భూస్వామి బ్రజ సుందర బిశాయి
భువనేశ్వర్ : ఒకప్పుడు ఆకలి చావులు, పిల్లల ఆమ్మకాలకు పేరుగాంచి పత్రికల పతాక శీర్షికల్లో నిత్యం నిలిచేది రాష్ట్రంలోని కలహండి జిల్లా. కరువు రక్కసి కబంధహస్తాల్లో నలిగిపోతున్న కలహండి జిల్లాను పచ్చగా మార్చేందుకు, సాగునీటి వనరుల కోసం బృహత్తర ఇంద్రావతి జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. అప్పటికి ఆ ప్రాంతంలోని ఫటాగుడ గ్రామానికి చెందిన బ్రజ సుందర బిశాయి 175 ఎకరాలకు పైగా భూస్వామి. ఆ గ్రామమంతా ఆయన ఆధీనంలో ఉండేది. ఇంద్రావతి జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం కోసం తన యావదాస్తి (భూమి) కోల్పోయాడు. అందుకు తగిన పరిహారం కూడా లభించలేదు. ఇంద్రావతి ప్రాజెక్టు వల్ల కలహండి జిల్లా నేడు కళకళ లాడుతుండగా ఆ ప్రాజెక్టు కోసం ఆస్తులు పోగొట్టుకున్న బ్రజ సుదర బిశాయి జీవితం సున్నం వెలిసిపోయిన గోడలా తయారైంది.
ఆయన నేడు ఇంద్రావతి ప్రాజెక్టు బాధితుడు. ఆయన కొడుకు పొట్ట నింపుకొనేందుకు పరాయి రాష్ట్రానికి వలస పోయాడు. ఒకనాటి జమీందారు బిశాయి నేడు కూలీగా మారి పార చేత పట్టి జీవనం గడుపుతున్నాడు. 70 యేళ్లు పైబడిన ఆయన ఒక గడ్డి ఇంటిలో భార్యతో ఉంటున్నాడు. గతంలో ఇంటిలో అనేకమంది పనివారుండేవారు. పనివారిని అజమాయిషీ చేసే ఆయన భార్య నేడు కర్రల పొయ్యిపై వంటచేస్తూ గత జ్ఞాపకాలతో కన్నీరు కారుస్తోంది. కొన్ని సమయాల్లో భర్తతో పాటు పనులకు వెళ్తోంది.
కూలి పనులకు వెళ్తున్న బిశాయి దంపతులు
కొండంత భూమి..గోరంత పరిహారం
ఆయన పూర్వీకుల భూమి తెంతులికుంఠి సమితి ముండిగుడ గ్రామంలో 5.52 ఎకరాలు, ముడిగుమ్మ గ్రామంలో 90 ఎకరాలు, కొరాపుట్ జిల్లా దశమంతపూర్ సమితి అంబాగుడ గ్రామంలో 80 ఎకరాలు ఉండేవి. ఆ నాడు వందలాది మంది పనివారితో ఆయన ఇల్లు సందడిగా ఉండేది. పాడి పంటలతో లక్ష్మి తాండవించేది. ఆ భూములన్నీ ఇంద్రావతి ప్రాజెక్టులో విలీనమయ్యాయి. ఆనాడు తెంతులికుంఠి సమితిలో ఆయన భూమికి రూ.1,42,387, దశమంతపూర్ సమితిలో భూమికి రూ.64, 861 పరిహారంగా అందింది. ప్రభుత్వం తనకు ఇచ్చిన పరిహారం సముద్రంలో నీటిబొట్టు అని, హారతి కర్పూరంలా ఖర్చయిపోయిందని బ్రజ సుందర బిశాయి వాపోయాడు.
ఇంద్రావతి ప్రాజెక్టుకు వల్ల తన సర్వస్వాన్ని కోల్పోయానని, ప్రాజెక్టు తనకు పేదరికం మిగిలి్చందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రాజెక్టు నిర్వాసితులకు తగిన పరిహారంతో పాటు, పునరావాసం కల్పిస్తామని పాలకులు ఎన్నో హామీలు ఇచ్చి, చివరికి మొండి చెయ్యి చూపారని కళ్లనీళ్లు కార్చాడు. ఎన్నో పోరాటాలు, ఆందోళనలు చేశాక ఒక రేషన్ కార్డు, వృద్ధాప్య పెన్షన్‌లు ప్రభుత్వం సమకూర్చిందని వెల్లడించాడు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నమ్మి యావదాస్తిని ధారబోసి నిరుపేదల్లా మిగిలామని బ్రజసుందర బిశాయి భోరుమన్నాడు.
ఆయన మాట గ్రామస్తులకు వేదవాక్కు. గ్రామస్తులే కాకుండా పరిసర ప్రాంతాల ప్రజలు కూడా ఆయనను జమీందారు అనే పిలిచేవారు. ఆయన వద్ద వందలాదిమంది పనిచేసేవారు. ఒకప్పుడు పదిమందికి దాతగా ఉన్న ఆయన నేడు పిడికెడు బియ్యం కోసం చేతులు చాచే పరిస్థితిలో ఉన్నాడు. రూపాయి కేజీ బియ్యం కోసం పడిగాపులు కాస్తున్నాడు. అందుకు కారణం ఇం«ద్రావతి జలవిద్యుత్ ప్రాజెక్టు. ఇంద్రావతి ప్రాజెక్టు పూర్తయింది. కలహండి జిల్లా సస్యశ్యామలమైంది. పేదరికం కొంత దూరమైంది. అయితే ఆనాటి భూస్వామి నేడు నిరుపేద అయిపోయాడు. అంతే కాదు వృద్ధాప్యంలో కూలిగా మారాడు. నవరంగపూర్ జిల్లా ఇంద్రావతి ప్రాంతంలోని ఫటాగుడ గ్రామానికి చెందిన బ్రజ సుందర బిశాయి దీనగాథ ఇది.
Comments
Please login to add a commentAdd a comment