నేడు ఆప్‌-కాంగ్రెస్‌ కూటమికి తొలి అగ్ని పరీక్ష! | Sakshi
Sakshi News home page

నేడు ఆప్‌-కాంగ్రెస్‌ కూటమికి తొలి అగ్ని పరీక్ష!

Published Tue, May 7 2024 7:02 AM

Litmus Test of AAP Congress Alliance in Gujarat and Goa

నేడు(మంగళవారం) జరిగే లోక్‌సభ మూడో దశ ఓటింగ్‌ ఆప్‌-కాంగ్రెస్‌ కూటమికి తొలి అగ్ని పరీక్ష కానుంది. ఈ దశలో 12 రాష్ట్రాల్లో ఓటింగ్ జరగనుంది. అయితే గుజరాత్‌లోని మొత్తం 26 స్థానాలకు జరుగుతున్న ఓటింగ్‌పైనే అందరి దృష్టి ఉంది. గోవాలోని రెండు స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. గోవా, గుజరాత్‌ రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ- కాంగ్రెస్ కూటమిగా పోటీ చేయడం ఇదే తొలిసారి.

గుజరాత్‌లోని రెండు స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తోంది. కాంగ్రెస్ 24 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మంచి ఫలితాలను రాబట్టింది. ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ భరూచ్, భావ్‌నగర్‌ల నుంచి అభ్యర్థులను నిలబెట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్, ఆప్‌లకు ఈ పొత్తు వల్ల ఎంత మేలు జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.

చాలా కాలంగా ఈ రెండు పార్టీల మధ్య సంబంధాలు సవ్యంగా లేవు. పంజాబ్‌లో కాంగ్రెస్‌ను ఓడించి ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాల్లో ఇరు పార్టీలు పరస్పరం సహాయ సహకారాలను అందించుకుంటున్నాయి. ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్‌ను కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ కలిశారు.

గోవాలో రెండు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. అవి దక్షిణ గోవా, ఉత్తర గోవా. ఉత్తర గోవాను బీజేపీకి కంచుకోటగా పరిగణిస్తారు. దక్షిణ గోవాలో గత 16 ఎన్నికల్లో కాంగ్రెస్ 10 సార్లు విజయం సాధించింది. 1999, 2014లో తప్ప దక్షిణ గోవా సీటును బీజేపీ ఎప్పుడూ గెలుచుకోలేదు. నార్త్ గోవా లోక్‌సభ స్థానంలో బీజేపీ సిట్టింగ్ ఎంపీ శ్రీపాద్ నాయక్ కాంగ్రెస్ అభ్యర్థి రమాకాంత్ ఖలాప్‌తో తలపడుతుండగా, దక్షిణ గోవాలో అధికార పార్టీ(బీజేపీ) అభ్యర్థి పల్లవి డెంపో కాంగ్రెస్ అభ్యర్థి విరియాటో ఫెర్నాండెజ్‌తో తలపడనున్నారు. ఉత్తర, దక్షిణ గోవా లోక్‌సభ స్థానాలకు ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గోవా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయం వెబ్‌సైట్‌లోని డేటా ప్రకారం రాష్ట్రంలో 11,79,644 మంది ఓటర్లు ఉన్నారు.

Advertisement
 
Advertisement