
న్యూఢిల్లీ: సహజీవనం ప్రమాదకరమైన జబ్బు అని బీజేపీ ఎంపీ ధరంబీర్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ విధానాన్ని సమాజం నుంచి పూర్తి నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం సహజీవన విధానానికి వ్యతిరేకంగా చట్టం తీసుకురావాలని కోరారు. లోక్‌సభలో గురువారం జీరో అవర్‌లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘పాశ్చాత్య దేశాల్లో సహజీవన సంబంధాలు సర్వసాధారణం.
కానీ, ఈ చెడ్డ విధానం మన సమాజంలో వ్యాధి మాదిరిగా వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీని పరిణామాలు భయంకరంగా ఉంటున్నాయి. ఢిల్లీలో చోటుచేసుకున్న శ్రద్ధావాకర్, అఫ్తాబ్ పూనావాలా లివ్–ఇన్ రిలేషన్ షిప్ ఎంతటి దారుణానికి దారి తీసిందో చూస్తున్నాం’ అని గుర్తుచేశారు. వివాహాన్ని పవిత్ర బంధంగా భావించే మనదేశంలో విడాకుల శాతం 1.1 శాతం మాత్రమేనన్నారు. అదే అమెరికాలో విడాకుల శాతం 40 శాతం వరకు ఉంటోందన్నారు.
ప్రేమ వివాహాల్లో విడాకుల శాతం ఎక్కువగా ఉంటోందని చెప్పారు. ఇలాంటి బంధాల విషయంలో ఇరువైపులా తల్లిదండ్రుల ఆమోదం తప్పనిసరి చేయాలని సూచించారు. సామాజిక, వ్యక్తిగత విలువలు, కుటుంబాల నేపథ్యాలను బట్టి పెళ్లిళ్లను పెద్దలు కుదర్చటం మన దేశంలో అనాదిగా వస్తోందని గుర్తు చేశారు. ‘వసుధైవ కుటుంబకమ్ అనే తత్వానికి భారతీయ సంస్కృతి ప్రసిద్ధి. మిగతా దేశాలతో పోలిస్తే మన సామాజిక వ్యవస్థ భిన్నమైంది. భిన్నత్వంలో ఏకత్వమన్న భారతీయ భావనను యావత్తు ప్రపంచమే మెచ్చుకుంది’అని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment