Dangerous diseases
-
సహజీవనం ప్రమాదకరమైన జబ్బు
న్యూఢిల్లీ: సహజీవనం ప్రమాదకరమైన జబ్బు అని బీజేపీ ఎంపీ ధరంబీర్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ విధానాన్ని సమాజం నుంచి పూర్తి నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం సహజీవన విధానానికి వ్యతిరేకంగా చట్టం తీసుకురావాలని కోరారు. లోక్‌సభలో గురువారం జీరో అవర్‌లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘పాశ్చాత్య దేశాల్లో సహజీవన సంబంధాలు సర్వసాధారణం. కానీ, ఈ చెడ్డ విధానం మన సమాజంలో వ్యాధి మాదిరిగా వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీని పరిణామాలు భయంకరంగా ఉంటున్నాయి. ఢిల్లీలో చోటుచేసుకున్న శ్రద్ధావాకర్, అఫ్తాబ్ పూనావాలా లివ్–ఇన్ రిలేషన్ షిప్ ఎంతటి దారుణానికి దారి తీసిందో చూస్తున్నాం’ అని గుర్తుచేశారు. వివాహాన్ని పవిత్ర బంధంగా భావించే మనదేశంలో విడాకుల శాతం 1.1 శాతం మాత్రమేనన్నారు. అదే అమెరికాలో విడాకుల శాతం 40 శాతం వరకు ఉంటోందన్నారు. ప్రేమ వివాహాల్లో విడాకుల శాతం ఎక్కువగా ఉంటోందని చెప్పారు. ఇలాంటి బంధాల విషయంలో ఇరువైపులా తల్లిదండ్రుల ఆమోదం తప్పనిసరి చేయాలని సూచించారు. సామాజిక, వ్యక్తిగత విలువలు, కుటుంబాల నేపథ్యాలను బట్టి పెళ్లిళ్లను పెద్దలు కుదర్చటం మన దేశంలో అనాదిగా వస్తోందని గుర్తు చేశారు. ‘వసుధైవ కుటుంబకమ్ అనే తత్వానికి భారతీయ సంస్కృతి ప్రసిద్ధి. మిగతా దేశాలతో పోలిస్తే మన సామాజిక వ్యవస్థ భిన్నమైంది. భిన్నత్వంలో ఏకత్వమన్న భారతీయ భావనను యావత్తు ప్రపంచమే మెచ్చుకుంది’అని ఆయన తెలిపారు. -
ముంచుకొస్తున్న మరో ముప్పు, ఈ నల్లని మేఘాలు ప్రమాదకరం ఎందుకంటే?
ఆకాశంలో దట్టమైన నల్లటి మేఘాలు కమ్ముకుంటే? మామూలుగా అయితే వాన రాకడకు సూచిక. కానీ, జీవజలాన్ని కాక ప్రమాదకరమైన బ్యాక్టీరియాను మోసుకొచ్చే మేఘాలున్నాయని తెలుసా? నిజం. ఇలాంటి మేఘాలున్నాయని కెనడా, ఫ్రాన్స్ పరిశోధకులు చెబుతున్నారు. ఔషధాల శక్తిని తట్టుకొని మరీ నిక్షేపంగా జీవించే బ్యాక్టీరియా ఈ మేఘాల్లో నిండి ఉంటుందని, వాటితో పాటే అది సుదూర ప్రాంతాలకు ప్రయాణిస్తుందని తాజా అధ్యయనంలో గుర్తించారు. ఒకరకంగా చెప్పాలంటే ప్రపంచమంతటినీ చుట్టేస్తుందన్నమాట! ఈ అధ్యయనం వివరాలను సైన్స్ ఆఫ్ ద టోటల్ ఎన్విరాన్మెంట్ పత్రికలో ప్రచురించారు. ► కెనడాలో క్విబెక్ సిటీలోని లావల్ యూనివర్సిటీ, సెంట్రల్ ఫ్రాన్స్‌లోని క్లెర్మాంట్ అవెర్జిన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు మేఘాల నమూనాలను సేకరించి పరీక్షించారు. ► 8,000 ఒక మిల్లీలీటర్ మేఘంలో సగటున ఉన్న బ్యాక్టీరియా సంఖ్య. ► మేఘాల్లోని ఈ బ్యాక్టీరియాలో 29 ఉపవర్గాలకు చెందిన యాంటీబయాటిక్‌ను తట్టుకునే జన్యువులు ఉన్నట్టు గుర్తించారు. ► ఈ మేఘాల్లో యాంటీబయాటిక్స్‌ను తట్టుకొనే జన్యువులతో కూడిన బ్యాక్టీరియా ఉన్నట్టు గుర్తించారు. ► 2019 సెప్టెంబర్ నుంచి 2021 అక్టోబర్ దాకా ఈ పరిశోధన నిర్వహించారు. ► చెట్లపై, భూమిలో ఉన్న బ్యాక్టీరియా గట్టి గాలుల ద్వారా వాతావరణంలోకి, అటునుంచి మేఘాల్లోకి చేరుతుంది. వాటితో పాటు సుదూరాలకు పయనిస్తుంది. ► సముద్ర మట్టానికి 1,465 మీటర్ల(4,806 అడుగులు) ఎత్తులో ఉన్న మేఘాల నుంచి నమూనాలను సేకరించారు. ► మిల్లీలీటర్ పరిమాణంలో 330 నుంచి ఏకంగా 30,000కు పైగా బ్యాక్టీరియా ఉన్నట్టు తేలింది. ► వర్షంగా కురిసిన చోట మేఘాల నుంచి భూమిపైకి చేరుతుంది. ► మేఘాల ద్వారా ఇలా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వ్యాప్తి చెందే బ్యాక్టీరియాతో మానవళి ఆరోగ్యానికి ఉన్న ముప్పుపై పూర్తిస్థాయి పరిశోధనలు జరగాల్సి ఉంది. ► ఈ బ్యాక్టీరియాలో 5 నుంచి 50 శాతం దాకా మాత్రమే క్రియాశీలకంగా ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. మేఘాల బ్యాక్టీరియా వల్ల మనుషులకు ముప్పు స్వల్పమేనని పరిశోధకురాలు ఫ్లోరెంట్ రోసీ అభిప్రాయపడ్డారు. ‘వర్షంలో బయట నడవాలంటే భయపడాల్సిన అవసరం లేదన్నమాట’ అంటూ చమత్కరించారు! ► మేఘాల్లోని బ్యాక్టీరియా జన్యువులు ఇతర బ్యాక్టీరియాతో కలుస్తాయా, లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదని రోసీ వెల్లడించారు. ► డ్రగ్–రెసిస్టెంట్‌ను కలిగిన బ్యాక్టీరియాల మూలాలను కనుగొనేందుకు ఈ పరిశోధన దోహదపడుతుందని సైంటిస్టులు భావిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మాయదారి మహమ్మారి
సాక్షి, హైదరాబాద్: కరోనా.. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న భయంకరమైన వైరస్.. దీని దెబ్బకు ప్రపంచమే చిగురుటాకులా వణుకుతోంది. రోజుకు 459 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. రెండు నెలల్లోనే ప్రపంచంలోని టాప్ 10 భయంకర వ్యాధుల జాబితాలో కరోనా వైరస్ చేరిందంటే దీని ప్రతాపం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచ ఆరో గ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గణాంకాల ప్రకారం ఇప్పటివరకు క్షయ (టీబీ) అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. దీని దెబ్బకు రోజు భూమిపై 3014 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో హెపటైటిస్ (2430 మంది), న్యుమోనియా (2215 మంది), హెచ్ఐవీ (2110 మంది), మలేరియా (2002 మంది) నిలిచాయి. ఇందులో టీబీ, హెపటైటిస్, న్యుమోనియా లాంటి చాలా వ్యాధులు క్రీస్తు పూర్వం నుంచి ఉన్నవే. కానీ కరోనా (కోవిడ్–19) ఉనికి బయట పడిన రెండు నెలల్లోనే ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసింది. ప్రస్తుతం ఈ వైరస్ ప్రపంచాని వణికిస్తున్న అతి భయంకరమైన వ్యాధుల్లో ఒకటిగా ఆవిర్భవించడం దీని తీవ్రతకు అద్దం పడుతోంది. వాటిని ఎప్పుడో దాటేసింది.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భయంకర వ్యాధుల్లో డెంగీ, ఆటలమ్మ, పొంగు, ఎబోలా, సార్స్, మెర్స్ వ్యాధులను కరోనా ఎప్పుడో దాటేసింది. వీటి వల్ల రోజుకు చనిపోతున్న వారి సంఖ్య రెండు నుంచి 50 మంది ఉండగా, కరోనా వల్ల రోజుకు ప్రపంచవ్యాప్తంగా సగటున 459 మంది మరణిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. అంతేకాదు.. ప్రపంచవ్యాప్తంగా రోజుకు 440 మందిని బలి తీసుకునే వూఫింగ్ కఫ్, 396 మందిని బలితీసుకున్న టైఫాయిడ్లను కూడా కరోనా దాటేయడం గమనార్హం. ఐరోపా, అమెరికా దేశాల్లో కరోనా జడలు విప్పింది. కానీ ఉష్ణ దేశాల్లో పరిస్థితి కాస్త ఆశాజనకంగానే ఉంది. మొదటి స్థానానికి ఎగబాకుతుందా..? జనవరి ఆఖరి వారంలో కరోనా వైరస్ కారణంగా మరణ మృదంగం మొదలైంది. రోజురోజుకు మరణాల సంఖ్య తీవ్రమవుతోంది. తొలివారంలో కేవలం 20 మరణాలు సంభవించాయి. ఈ వ్యాధి ప్రపంచదేశాలకు విస్తరించిన దరిమిలా కొన్ని దేశాల్లో రోజుకు 600 నుంచి 800 మందికి పైగా ప్రజల ప్రాణాలకు హరించేస్తోంది. ఇప్పటిదాకా ఈ కరోనా వైరస్ 35,349 మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఈ కరోనా వైరస్ సాగిస్తున్న మరణ మృదంగం ఇలాగే కొనసాగితే త్వరలోనే అతి భయంకరమైన వ్యాధుల జాబితాలో మొదటి స్థానానికి ఎగబాకే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ లోపు వ్యాధి నియంత్రణ, వ్యాక్సిన్ అందుబాటులోకివస్తే ఈ మరణాలకు అడ్డుకట్ట వేయొచ్చు. అందరం ఊపిరి పీల్చుకోవచ్చు. పలు వ్యాధుల వల్ల ప్రపంచవ్యాప్తంగా రోజువారీ మరణాలు.. -
పాపం పండుతుందా!
రసాయనాలతో కాయలు మాగబెడుతున్న వ్యాపారులు తింటే ప్రమాదకరమైన రోగాలు అమ్మతనమూ కోల్పోయే ప్రమాదం హైకోర్టు ఆదేశాలతోనైనా అధికారుల్లో కదలిక వచ్చేనా? జిల్లాలో పండ్ల వ్యాపారం అనారోగ్యానికి కేంద్రంగా మారింది. వ్యాపారులు విషపూరిత రసాయనాలను కలిపి 24 గంటల్లోనే పచ్చటి కాయల్ని పండ్లుగా మార్చేస్తున్నారు. డబ్బిచ్చి కొనుక్కున్న పాపానికి వినియోగదారుడికి అనారోగ్యాన్ని అంటగడుతున్నారు. వీటిని తింటే రోగాలే రావడమే కాకుండా అమ్మతనమూ కోల్పోయే ప్రమాదముందని వైద్యులు చెబుతున్నారు. పండ్లలో రసాయనాలు కలపడంపై హైకోర్టు అక్షింతలు వేసిన నేపథ్యంలో జిల్లాలో జరుగుతున్న రసాయన పండ్ల అమ్మకాలపై స్పెషల్ ఫోకస్.. పలమనేరు: మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలంటే రోజువారీ ఆహారంలో పండ్లు తినాలని నిపుణులు చెబుతుంటారు. ఇదంతా గతం. ఇప్పుడు జిల్లాలోని పండ్ల మార్కెట్లో దొరికే కొన్ని రకాల పండ్లను తింటే మనిషికి ఆరోగ్యమేమో గానీ అనారోగ్యం మాత్రం తప్పదు. పచ్చికాయలను సైతం రసాయనాలతో మాగ బెట్టేస్తుండడంతో ఇవి ప్రజల పాలిట శాపంగా మారాయి. ప్రస్తుతం జిల్లాలోని పలు పట్టణాల్లో ఇదే తంతు. పలురకాల కాయలను పండ్లుగా చేసి జనానికి అమ్మేస్తున్నారు. జిల్లాలోని తిరుపతి, చిత్తూరు, పలమనేరు, వి.కోట, కుప్పం, పుంగనూరు, మదనపల్లె తదితర పట్టణాల్లో పచ్చి కాయలను రసాయనాలతో మాగబెట్టే గోడౌన్లు ఉన్నాయి. బెంగళూరు, చెన్నై నుంచి వ్యాపారులు ఇక్కడికి కాయలను తీసుకొస్తున్నారు. వాటిని కొనుగోలు చేసిన వ్యాపారులు వాటిని ఈ గోడౌన్‌కు తరలించి వాటిని మాగబెట్టడానికి నిర్ణీత రుసుం చెల్లిస్తారు. 24 గంటల్లోపు కాయలు పండ్లుగా మారుతున్నాయి. వీటిని పట్టణాల్లో యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. కాయలను ఊదర ప్రక్రియ, బోధ కసువులో పెట్టి మాగబెట్టడం లాంటి పాత పద్ధతులు ఇప్పుడు కనిపించడం లేదు. ఇదీ తతంగం.. గోడౌన్‌కు తరలించిన అరటి, మామిడి కాయలను మొదట మ్యాంకోజబ్-45 (ఎం.-45), అనే పౌడర్‌ను ఒక లీటరు నీటికి ఒక మిలీ చొప్పున వేస్తారు. ఆ నీటిలో ఈ పచ్చి కాయలను ముంచి పక్కన బెడతారు. తర్వాత ఇథాలీన్ అనే బిళ్లలను నీటిలో వేస్తే దాని నుంచి గ్యాస్ వస్తుంది. ఓ గదిలో కాయలను ఉంచి ఈ గ్యాస్‌ను వదిలి ఆ గదిలోకి గాలిపోకుండా చేస్తారు. మరోవైపు వేపర్ ట్రీట్మెంట్ పేరిట కాయలను బందీ చేసిన గదుల్లోకి విషపూరితమైన మిథైల్ గ్యాస్‌ను వదిలి పెడతారు. దీంతో 20 నుంచి 24 గంటల్లోనే పచ్చి కాయలు రంగు మారి పండ్లుగా తయారవుతాయి. మామిడి కాయలను అపాయకర కాల్షియం కార్భైట్లతో మాగబెడతారు. పండ్లు పూర్తి విషపూరితంగా మారుతున్నాయి. ఎక్కువ మోతాదులో ఈ పండ్లను తిన్న నాలుగైదు గంటల్లోపు వాంతులు, విరేచనాలు అవుతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దానికి తోడు దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ముఖ్యంగా గర్భిణులు, పసిపిల్లలకు వ్యాధులుసోకే అవకాశం ఎక్కువని వైద్యులు అంటున్నారు. పట్టించుకునే నాథుడే లేరు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతూ విషపూరితమైన రసాయనాలతో కాయలను మాగబెట్టి జిల్లాలోని వివిధ కేంద్రాల్లో పెద్దఎత్తున విక్రయిస్తున్నారు. పట్టణాల్లోని మున్సిపల్ ఫుడ్ ఇన్స్పెక్టర్లు, ఆహార కల్తీ నిరోధక శాఖ ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ వారు స్పందించడం లేదు. మదనపల్లె, చిత్తూరు, తిరుపతిల్లో ఉండే ఫుడ్ ఇన్స్పెక్టర్లు వచ్చి తనిఖీ చేసిన దాఖలాలు అస్సలు లేవు. పండ్లలో రసాయనాల కలపడంపై తీవ్రంగా స్పందించిన రాష్ట్ర హైకోర్టు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని గట్టిగా ఆదేశించింది. దీంతోనైనా అధికారులు స్పందిస్తారేమో చూడాలి.