పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో ఆమధ్య కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను వెనుక నుంచి గూడ్స్ రైలు ఢీకొంది. ఈ ఘటనపై విచారణ అనంతరం గూడ్స్ రైలు లోకో పైలట్ అనిల్‌కుమార్ కుటుంబానికి ఊరట లభించింది. రైల్వే సేఫ్టీ చీఫ్ కమిషనర్ (సీసీఆర్‌ఎస్)తన నివేదికలో జూన్ 17న జరిగిన కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గూడ్స్ రైలు లోకో పైలట్ అనిల్‌కుమార్ కారకుడు కాదని తేల్చి చెప్పారు. దీనిని విన్న అనిల్‌కుమార్ భార్య ఇప్పుడే తన భర్త ఆత్మకు శాంతి చేకూరిందని పేర్కొన్నారు.
ఆ నాటి ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, 43 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై సీసీఆర్‌ఎస్ నివేదిక వెలువడిన అనంతరం లోకో పైలట్ అనిల్ భార్య రోష్ణి కుమార్ మాట్లాడుతూ ‘రైలు ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే నా భర్త ప్రమాదానికి కారకుడంటూ అధికారులు తేల్చేశారు. దర్యాప్తు ప్రారంభించకముందే నా భర్తను బాధ్యుడుగా చేయడాన్ని విని నేను షాక్ అయ్యాను. అయితే ఇప్పుడు రైల్వేశాఖ సరైన విచారణ జరిపి, తన భర్తను నిర్దోషిగా తేల్చినందుకు సంతోషిస్తున్నాను. ఇప్పుడు మా ఆయన ఆత్మకు శాంతి చేకూరుతుంది’ అని పేర్కొన్నారు.
నాడు గూడ్స్ రైలు కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను వెనుక నుండి ఢీకొన్న దరిమిలా రైల్వే బోర్డు చైర్‌పర్సన్ జయ వర్మ సిన్హాతో పాటు ఇతర రైల్వే అధికారులు ఈ ప్రమాదానికి ఘటనలో మృతి చెందిన పైలట్ అనిల్ కుమార్, అతని సహాయకుడు కారణమనే నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ ప్రమాదంపై అధికారుల జరిపిన విచారణలో.. కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ ట్రాక్‌పై ఉన్నప్పటికీ, గూడ్స్ రైలు లోకో పైలట్‌ను ఆ సెక్షన్‌లో వెళ్లడానికి అనుమతించారని, ఎటువంటి జాగ్రత్తలు లేకుండా అతనికి తప్పుడు సంకేతాలను పాస్ చేశారని సీసీఆర్‌ఎస్ ప్రాథమిక నివేదిక పేర్కొంది.
ఆ సమయంలో గూడ్స్ రైలు గంటకు 78 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. గూడ్సు రైలు పైలట్ కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ వెనుక భాగాన్ని గమనించి, అత్యవసర బ్రేకులు వేశాడు. దీంతో గూడ్సు రైలు వేగం నెమ్మదించి, అది కాంచన్‌జంగాను గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఢీకొన్నదని తేలింది. ఇది అనిల్ అప్రమత్తతను తెలియజేస్తుందని నివేదికలో పేర్కొన్నారు.
ప్రమాదానికి సంబంధించిన దర్యాప్తు నివేదిక అందిన దరిమిలా అనిల్ కుమార్ కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం అందజేశామని రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ విషయమై ఎన్‌ఎఫ్‌ఆర్ సీనియర్ అధికారి మాట్లాడుతూ బాధిత కుటుంబానికి పెన్షన్ ఆర్డర్ కూడా జారీ అయ్యిందని, త్వరలో గ్రాట్యుటీ కూడా చెల్లించనున్నారన్నారు. మృతుని కుమారులు మైనర్‌లు అయినందున వారిలో ఒకరికి పెద్దయ్యాక రైల్వేలో ఉద్యోగం ఇవ్వనున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment