Kishori Lal Sharma: ఆమె నాకు పోటీయే కాదు! | Lok Sabha Election 2024: Amethi Congress candidate Kishori Lal Sharma Exclusive Interview | Sakshi
Sakshi News home page

Kishori Lal Sharma: ఆమె నాకు పోటీయే కాదు!

Published Fri, May 17 2024 4:52 AM | Last Updated on Fri, May 17 2024 4:52 AM

Lok Sabha Election 2024: Amethi Congress candidate Kishori Lal Sharma Exclusive Interview

కిశోరీ లాల్‌ శర్మ ఇంటర్వ్యూ  

కిశోరీ లాల్‌ శర్మ.. అమేథీలో కాంగ్రెస్‌ తురుపు ముక్క. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఊహించని ప్రత్యరి్థ. రాజీవ్‌గాంధీ నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్‌కు నమ్మిన బంటు ఈ 63 ఏళ్ల కేఎల్‌ శర్మ. ఇన్నాళ్లు తెరవెనుక చక్రం తిప్పిన శర్మ ఇప్పుడు నేరుగా బరిలోకి దిగి బీజేపీతో అమీతుమీ తేల్చుకోనున్నారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయన బలం. గాం«దీలతో మైత్రి సహా.. పలు అంశాలపై ఆయన పంచుకున్న ముచ్చట్లివి..  

ఇన్నాళ్లు తెర వెనుక ఉన్నారు. ఇప్పుడు తెరమీదకు వచ్చారు. ఈ మార్పు ఎలా ఉంది? 
ఎన్నికలకు సంబంధించి పెద్దగా మార్పు లేదు. నేనెప్పుడూ ఒంటరిగా ఏమీ చేయలేదు. 25–30 ఏళ్లుగా నాతో కలిసి పనిచేస్తున్నవారున్నారు. కాలం మారింది.. కొత్తగా చేయాలి. టీమ్‌ అదే.. పని తీరే మారింది.  

ఐదేళ్ల కిందట రాహుల్‌ ఓడిపోయిన చోట నుంచి పోటీని ఎలా చూస్తున్నారు? 
గతంలో పొరపాట్లు జరిగాయి. దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు? ఎలా? అన్న అంతర్మథనం జరిగింది. రెండు విషయాలు బలంగా పనిచేశాయి. బీజేపీ ప్రభుత్వం నుంచి ఎదురైన ఒత్తిడితోపాటు మా వైపు నుంచి కూడా లోపాలు జరిగాయి. ఆ ఎన్నికల్లో దిశా నిర్దేశం చేసే నాథుడు లేరని కార్యకర్తలు వాపోయారు. బీజేపీ గెలిచింది 55,000 ఓట్ల తేడాతోనే. అది పెద్ద నంబర్‌ కాదు.  

ఓటమికి కారణమైన వారినే అభ్యరి్థగా నిలబెట్టారని బీజేపీ ఆరోపణ కదా!  
2019 ఎన్నికల్లో నేను అమేథీలో లేను. రాయ్‌బరేలీలో పోలింగ్, ఎన్నికల నిర్వహణ చూస్తున్నాను. ఇప్పుడు నేను, నా ప్రత్యేక బృందం ఇక్కడ పనిచేస్తోంది. తేడా అదే! 

‘గాంధీ కుటుంబ చప్రాసి’ వ్యాఖ్యలను ఎలా ఎదుర్కొంటారు? 
నేనెవరినో అమేథీ, రాయ్‌బరేలీ ప్రజలందరికీ తెలుసు. 1980లో యువజన కాంగ్రెస్‌ కార్యకర్తగా నా రాజకీయ జీవితం ప్రారంభమైంది. 1983లో రాజీవ్‌ గాంధీ జీ 20 ప్రోగ్రామ్‌ను పర్యవేక్షించడానికి కొంతమంది యువ నాయకులను ఎంపిక చేశారు. వారిలో నేను ఒకడిని. ఒకటిన్నర బ్లాకులు చూసుకోవాల్సిన బాధ్యత నాకు అప్పచెప్పారు. ‘అమేథీ మే దిల్‌ లగ్‌ గయా’ (అమేథీ మీద మనసు పారేసుకున్నా). ఇక్కడే ఉండిపోయాను. కొందరు నన్ను సోనియాగాం«దీకి పీఏ అంటారు. ఎవరేమనుకున్నా.. నేను ప్రజాప్రతినిధిని. పంజాబ్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ సభ్యుడిని. స్టార్‌ క్యాంపెయినర్‌ని. 2013లో ఏఐసీసీ కార్యదర్శిగా, సీపీ జోషితో కలిసి బిహార్‌కు కో–ఇన్‌చార్జ్‌గా ఉన్నాను. బిహార్‌లో కూటమి ఏర్పాటు చేసినప్పుడు 27 స్థానాల్లో విజయం సాధించాం. 
ఏం తెలియకుండా మాట్లాడేవారికి నేనేం చెప్పగలను?  

మీ కుటుంబం? 
భార్య. ఇద్దరు కూతుళ్లు. ఒకరు ఎంబీఏ చేసి మార్కెటింగ్‌లో ఉద్యోగం చేస్తున్నారు. రెండో కూతురు వ్యాపారవేత్త. 

మీ పోటీతో పారీ్టలో అంతర్గత విభేదాలు పెరిగాయని భావిస్తున్నారా? 
పారీ్టలో అంతర్గత పోరు ఉంది. కానీ నా విషయానికి వస్తే అది లెక్కలోకి రాదు. నేను వాళ్ళ అన్నయ్య లాంటివాడిని. తిట్టగలను, ప్రేమగా మాట్లాడగలను. వాళ్లూ నాతో అలాగే ఉంటారు. పోటీకి గ్రూపులు మంచివే. కానీ పార్టీని దెబ్బతీసే గ్రూపులు ఉండొద్దని చెబుతుంటా.  

ఎన్నికల్లో పోటీ చేయమని మిమ్మల్ని ఎవరు అడిగారు? 
అమేథీలోని ఇతర కార్యకర్తలు కోరుకున్నట్లే నేను కూడా రాహుల్‌జీ పోటీ చేయాలని కోరుకున్నా. కానీ నామినేషన్లకు ముందు ప్రియాంక ‘కిషోరీ జీ మా కుటుంబం కోసం మీరు ఎన్నో ఎన్నికల్లో పోరాడారు. ఈ ఎన్నికల్లో మేం మీకోసం పోరాడాలనుకుంటున్నాం’ అని చెప్పారు. నేను అంగీకరించాను.  

మీ ప్రచారానికి చాలా తక్కువ సమయం ఉంది! 
స్మృతి ఇరానీ ఎంత ప్రచారమైనా చేసుకోనీ. ఆమె అసలు నాకు పోటీయే కాదు. కష్టపడి పని చేయడమే నాకు తెలుసు. ఇక నిర్ణయం ప్రజలది. స్మృతి ఇరానీ చేస్తున్న ఆరోపణల విషయానికొస్తే, ఆమెను కించపరిచేలా నేనెప్పుడూ మాట్లాడలేదు. నాపై నోరు పారేసుకోవడం ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా.  

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement