14 స్థానాలకు 7న పోలింగ్ 2019లో బీజేపీ ఏకపక్ష విజయం ఈసారి గట్టి పోటీ ఇస్తున్న కాంగ్రెస్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో కన్నడనాట క్లీన్‌స్వీప్ చేసిన కమలనాథులు ఈసారి చెమటోడుస్తున్నారు. రాష్ట్రంలో 28 స్థానాలకు గాను 14 చోట్ల రెండో విడతలో పోలింగ్ ముగిసింది. మిగతా 14 స్థానాలకు ఈ నెల 7న పోలింగ్ జరగనుంది. ఇవన్నీ ఉత్తర, మధ్య కర్నాటక ప్రాంతంలోనివే.
వీటిలో బీజేపీకి కాంగ్రెస్ బలమైన పోటీనిస్తోంది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ, మాజీ మంత్రి బి.శ్రీరాములు, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అల్లుడు, బీజేపీ రాష్ట్ర దిగ్గజమైన యడ్యూరప్ప కుమారుడు బి.వై.రాఘవేంద్ర, మాజీ సీఎంలు బస్వరాజ్ బొమ్మై, జగదీశ్ శెట్టర్ వంటి ప్రముఖుల భవితవ్యాన్ని ఈ విడతలో ఓటర్లు తేల్చనున్నారు. ఈ విడతలోని కొన్ని కీలక స్థానాలపై ఫోకస్...
హవేరి
గతేడాది దాకా కర్నాటక ముఖ్యమంత్రిగా ఉన్న బస్వరాజ్ బొమ్మై ఇక్కడ బీజేపీ అభ్యరి్థగా బరిలో దిగారు. దాంతో గెలుపు ఆయనకు ప్రతిష్టాత్మకంగా మారింది. 2019లో ఇక్కడ బీజేపీ నుంచి శివకుమార్ చనబసప్ప ఉదాసి 1.41 లక్షల మెజారిటీతో కాంగ్రెస్ నేత డీఆర్ పాటిల్‌పై నెగ్గారు. ఈసారి కాంగ్రెస్ నుంచి ఆనందస్వామి గడ్డదేవరమట్ పోటీ చేస్తున్నారు. హవేరిలో మొత్తం 14 మంది అభ్యర్థులు తుది పోటీలో నిలిచారు.
కలబురిగి
కర్నాటకలో హై ప్రొఫైల్ సీట్లలో ఇదీ ఒకటి. కాంగ్రెస్ నుంచి పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అల్లుడు రాధాకృష్ణ దొడ్డమణి పోటీలో ఉన్నారు. ఒకప్పుడు ఇది ఖర్గే దుర్గం. 2019లో బీజేపీ నెగ్గింది. నాటి ఎన్నికల్లో ఖర్గేను ఆయన మాజీ శిష్యుడు డాక్టర్ ఉమేశ్ జాదవ్ (బీజేపీ) ఓడించడం విశేషం! ఈ విడత అల్లుడినైనా గెలిపించుకోలేకపోతే ఖర్గేకు ఇబ్బందికరమే. దాంతో ఆయన సర్వశక్తులూ ధారపోస్తున్నారు. ఈ లోక్‌సభ పరిధిలోని 8 అసెంబ్లీ సీట్లలో గతేడాది ఎన్నికల్లో ఏకంగా ఆరింటిని గెలుచుకోవడం కాంగ్రెస్‌కు అనుకూలాంశం. 35 శాతమున్న దళితులపైనా ఆశలు పెట్టుకుంది.
బళ్లారి
ఈ ఎస్టీ రిజర్వుడు స్థానం ఇనుప ఖనిజం గనులకు ప్రసిద్ధి. బీజేపీ నేత, మాజీ మంత్రి బి.శ్రీరాములు, సండూర్ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యే అయిన కాంగ్రెస్ నేత ఇ.తుకారాం మధ్య పోటీ నెలకొంది. గతేడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బళ్లారి నుంచి పోటీ చేసి ఓటమి చవిచూసిన శ్రీరాములుకు ఇప్పుడు గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. 2014లో ఇక్కడ ఆయన గెలిచారు కూడా. 2018 ఉప ఎన్నికలో ఈ స్థానం కాంగ్రెస్ చేతికి వెళ్లింది. 2019లో బీజేపీ అభ్యర్థి వై.దేవేంద్రప్ప గెలిచారు. బళ్లారిలో ఆరు లక్షలకు పైగా ఎస్టీ ఓటర్లతో పాటు లింగాయత్‌లు, మైనారిటీలు, కురుబలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. 2008లో ఎస్టీలకు రిజర్వ్ చేయక ముందు 1952 నుంచి 1999 దాకా బళ్లారిలో కాంగ్రెసే గెలుస్తూ వచి్చంది. స్థానికేతరుడు కావడం తుకారాంకు ప్రతికూలం కావచ్చు.
మారిన చిత్రం
2019 ఎన్నికల్లో కర్నాటకలో మోదీ హవా సాగింది. దాంతో 28 స్థానాలకు గాను ఏకంగా 25 బీజేపీ ఖాతాలో చేరాయి. 7న పోలింగ్ జరిగే 14 స్థానాలూ బీజేపీ కైవసం చేసుకున్నవే. కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుండటంతో వాటిని నిలబెట్టుకోవడం కమలదళానికి ప్రతిష్టాత్మకంగా మారింది. బీజేపీ మద్దతుదారులైన లింగాయత్‌లు గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు మళ్లారు. ఈసారి వారు ఎవరికి ఓటేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. సంప్రదాయ ఓటు బ్యాంకైన అహింద గ్రూప్‌లు(దళితులు), మైనారిటీలపైనా హస్తం ఆశలు పెట్టుకుంది.
వీరికి ప్రతిష్టాత్మకం
కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. అల్లున్ని గెలిపించుకోవడంతో పాటు తన సొంత ప్రాంతమైన కల్యాణ కర్ణాటకలో ఎక్కువ స్థానాలను గెలిపించి సత్తా చూపించాలని ఆయన పట్టుదలగా ఉన్నారు. అలాగే బీజేపీ రాష్ట్ర చీఫ్ విజయేంద్ర, ఆయన తండ్రి యడ్యూరప్పకు కూడా ఈ ఎన్నికలు అత్యంత్ర ప్రతిష్టాత్మకమే. వీరితో పాటు సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాంగ్రెస్ తరఫున అగ్రనేత రాహుల్ గాం«దీ, ప్రియాంక, సిద్ధరామయ్య, బీజేపీ నుంచి మోదీ, పార్టీ చీఫ్ నడ్డా తదితరులు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment