ఒడిశాలో తొలి ఎన్నికల సభలో ప్రధాని మోదీ
బరంపూర్/నబారంగ్‌పూర్: ఒడిశా శాస నసభ ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4వ తేదీన రాష్ట్రంలో బిజూజనతాదళ్ (బీజేడీ) ప్రభుత్వం అంతర్థానమవుతుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల హడావిడి మొదలయ్యాక మొదటి సారిగా ప్రధాని మోదీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేశారు. దేశంలోనే అగ్రరాష్ట్రంగా ఒడిశాను తీర్చిదిద్దే సదవకాశాన్ని బీజేపీకి ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తిచేశారు.
ఒరియా భాష, సంస్కృతులను అర్థంచేసుకునే ముఖ్యమంత్రే రాష్ట్రానికి అవసరమని బీజేడీ చీఫ్, సీఎం నవీన్ పట్నాయక్‌పై మోదీ విమ ర్శలు గుప్పించారు. పట్నాయక్‌కు ఒరియా భాషపై పట్టులేదని ఓ అపవాదు ఉంది. గిరిజనుల జనాభా ఎక్కువగా ఉండే నబా రంగ్‌పూర్, బరంపూర్‌లలో సోమవారం ఎన్నికల ర్యాలీల్లో మోదీ ప్రసంగించారు.
ఎన్నికలయ్యాక డబుల్ ఇంజన్ సర్కార్
‘‘మోదీ నాయకత్వంలో పదేళ్ల అభివృద్ధిని మీరు కళ్లారాచూశారు. గత ప్రభుత్వాలతో పోలిస్తే మోదీ ప్రభుత్వం గిరిజనులకు కేటాయింపులను ఐదు రెట్లు పెంచింది. గిరిజన ప్రాంతాల్లో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లను 400కు పెంచాం. ఒక్క నా మంత్రిత్వశాఖలోనే ఎస్‌సీ, ఎస్టీ, ఓబీసీ ఉద్యోగులు 7 శాతం దాకా ఉన్నారు. బీజేడీ సర్కార్ కేంద్ర ఆయుష్మాన్ భారత్ యోజన పథకాన్ని రాష్ట్రంలో అమలుచేయని కారణంగా ఇక్కడి ప్రజలు ఆ పథక ప్రయోజనాలకు దూరమయ్యారు. జల్‌జీవన్ మిషన్ కింద ఒడిశాకు రూ.10,000 కోట్లు ఇచ్చాం. కానీ పట్నాయక్ సర్కార్ వాటిని సద్వినియోగం చేయలేదు’’ అని ఆరోపించారు.
మాకు ఐదేళ్లు ఇవ్వండి
‘‘ రాష్ట్రాన్ని పాలించే అవకాశాన్ని మీరు కాంగ్రెస్‌కు 50 ఏళ్లు ఇచ్చారు. బీజేడీకి 25 సంవత్సరాలు ఇచ్చారు. బీజేపీకి కేవలం ఐదు సంవత్సరాలు ఇచ్చి చూడండి. దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా ఒడిశాను తీర్చిదిద్ది చూపిస్తాం’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment