సాక్షి, ముంబై : ఇకపై బలాబలాలు నిరూపించుకోవడాల్లేవ్..ఎన్నికల బరిలోకి దిగి మెజార్టీ స్థానాల్లో గెలవడమే తరువాయి అంటూ మహారాష్ట్రలోని మహాయుతి (బీజేపీ, శివసేన-షిండే వర్గం, ఎన్సీపీ-అజిత్‌పవార్ వర్గం) కూటమి ఎన్నికల బరిలోకి దిగనుంది. ఇన్ని రోజులు సీట్ల పంపకంలో నాన్చుతూ వస్తున్న అంశాన్ని ట్రబుల్ షూటర్ అమిత్ షా యూటర్న్ తిప్పారు. చర్చలు సఫలం కావడంతో కూటమిలో ఇతర భాగస్వాములు ఎవరెన్ని సీట్లు పోటీ చేస్తారనేది త్వరలోనే స్పష్టత ఇవ్వనున్నారు.
రోజుల తరబడి సాగిన చర్చల తర్వాత, మహారాష్ట్రలో మహాయుతి కూటమి ప్రభుత్వంలో సీట్ల పంపకం పురోగతి సాధించింది. ఎన్సీపీ- అజిత్ పవార్ వర్గం నాలుగు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అంగీకరించినట్లు పలు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.
మహరాష్ట్రలో మొత్తం 48 లోక్‌సభ స్థానాలు ఉండగా.. తమకు క్షేత్రస్థాలు బలం ఎక్కువగా ఉందంటూ ఎన్సీపీ- అజిత్ పవార్ వర్గం 11 స్థానాలు, శివసేన-ఏక్ నాథ్ షిండే వర్గం 22 స్థానాల్లో పోటీ చేస్తామని పట్టుబట్టాయి.
అయితే షిండే వర్గానికి 22 సీట్లు, అజిత్‌పవార్‌కు 11 సీట్లు కేటాయిస్తే మాకు మిగిలేదేంటి? 48 సీట్లలో 15 సీట్లా? అది ఎలా సాధ్యపడుతుంది’ అని బీజేపీ నేతులు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో సీట్ల పంపకంపై పలు దఫాలుగా చర్చలు జరిగినా.. అవి కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా రంగంలో దిగారు. పరిస్థితుల్ని చక్కబెట్టారు.
తాజాగా, ఎన్సీపీ- అజిత్ పవార్ వర్గం బారామతి, రాయ్‌గఢ్, షిరూర్, పర్భాని.. ఈ నాలుగు లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టేందుకు అంగీకరించింది. ఇక శివసేన ఏక్‌నాథ్ షిండే వర్గం 13 స్థానాల్లో, బీజేపీ 31 స్థానాల్లో పోటీ చేయనుంది. కాగా, ఆయా స్థానాల్లో అభ్యర్ధుల ఎంపిక? ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నారనే అంశాలపై మహాయుతి కూటమి అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment