కొంత మంది యువకుల మధ్య పలు రకాల పోటీలు పెట్టి విజేతతో వధువుకు వివాహం చేయడం పురాణాల్లోనూ, పురాతన కాలంలోనూ జరిగేదని విన్నాం. ఇలాంటి స్వయం వరమే.. కాకపోతే కొంచెం ప్రత్యేకంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఒక అమ్మాయిని ప్రేమించిన నలుగురు యువకుల మధ్య లక్కీ డ్రా నిర్వహించి ఒకరికి వధువును కట్టబెట్టారు. ఈ సంఘటన ఇటీవల రాంపూర్ జిల్లాలోని ఓ గ్రామంలో జరిగింది.
అసలేమైందంటే..
అజీమ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నలుగురు అబ్బాయిలు నివసిస్తున్నారు. ఆ నలుగురు కలసి తాండా పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఓ అమ్మాయిని ప్రేమించారు. ఆ అమ్మాయి కూడా ఎవర్నీ కాదనకుండా ఆ నలుగురినీ ప్రేమించింది. కొంతకాలం ఈ చతుర్ముఖ ప్రేమాయణం సాగిన తర్వాత.. ఆ నలుగురూ కలసి అమ్మాయిని ఎత్తుకెళ్లి వేరే ఊరిలో దాచి పెట్టారు. రెండు రోజుల తర్వాత ఈ విషయం ఆ నోటా, ఈ నోటా అమ్మాయి గ్రామానికి చేరింది. విషయం బయటపడ్డ తర్వాత ఆ లవర్లను బలవంతంగా ఊరికి తీసుకొచ్చారు. అమ్మాయి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి రెడీ అయ్యాడు. అయితే అతన్ని గ్రామస్తులు వారించారు. ఎత్తుకెళ్లిన అబ్బాయిల్లో ఒకరితో ఆ అమ్మాయి వివాహం చేసేద్దామని తండ్రిని సముదాయించారు.
పెద్దలు ఆ అమ్మాయిని పిలిచి నలుగురిలో నీకెవరంటే ఇష్టం అని అడిగారు. ఆ అమ్మాయి.. తడుముకోకుండా నలుగురూ ఇష్టమే అని చెప్పింది. అమ్మాయి ఎటూ తేల్చకపోవడంతో.. తర్వాత అబ్బాయిలు నలుగురినీ పిలిచి.. మీ నలుగురు కలసి మీలో ఒకరిని నిర్ణయిస్తే అతనికిచ్చి పెళ్లి చేస్తామని చెప్పారు. దీనిని నలుగురూ ఒప్పుకోలేదు. దీంతో పెద్దలు తల పట్టుకున్నారు. ఇలా మూడు రోజులు చర్చలతోనే గడిచిపోయాయి. ఇక నాలుగో రోజు ఈ విషయాన్ని ఎలాగైనా తేల్చేయాలని నిర్ణయానికి వచ్చారు. లక్కీ డ్రానే దీనికి పరిష్కారమని విశ్వసించారు. లవర్సు, పెద్దలు అంతా పంచాయతీ వద్దకు చేరి నాలుగు స్లిప్పులై నలుగురు అబ్బాయిల పేర్లు రాసి లక్కీ డ్రా వేశారు. డ్రాలో విజేతగా నిలిచిన అబ్బాయికి అమ్మాయినిచ్చి వివాహం చేసేశారు.
Comments
Please login to add a commentAdd a comment