భోపాల్: భారత్‌లోనూ ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఎఫ్7 కేసులు నమోదవ్వడంతో కోవిడ్ వ్యాప్తిపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరోనా కారణంగా లాక్ విధిస్తారని, త్వరలో విద్యాసంస్థలు కూడ బంద్ చేస్తారనే వార్తలు కూడా వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. ఈ వార్తలు పుకార్లేనని, వాటిలో వాస్తవం లేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐడీ) కొట్టిపారేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం నిజంగానే దేశంలోని పలు రాష్ట్రాల్లో స్థానిక ప్రభుత్వాలు పాఠశాలలకు సెలవులు ప్రకటించాయి. అయితే కరోనా కారణంగా కాదు.
ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చలి తీవ్రత పెరగడంతో మధ్యప్రదేశ్‌లోని కొన్ని జిల్లాలో స్కూళ్లను మూసేశారు. మధ్యప్రదేశ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా చలిగాలులు జోరుగా వీస్తున్నాయి. చలి తీవ్రరూపం దాల్చడంతో భోపాల్, ఇండోర్, విదిషా, ఉజ్జయినితో సహా కొన్ని జిల్లాలో 8వ తరగతి వరకు పాఠశాలలు మూసేస్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.
ఛతర్‌పూర్ జిల్లాలోని నౌగాంగ్ పట్టణంలో శుక్రవారం ఉదయం అత్యల్పంగా 0.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు భారత వాతావరణ శాఖ సీనియర్ అధికారి హెచ్‌ఎస్ పాండే తెలిపారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉదయం పూట రోడ్లపై పొగమంచు ఏర్పడటం కారణంగా అసలు ప్రయాణికులే కనిపించడం లేదని పేర్కొన్నారు. విపరీతమైన చలిలో ప్రజలు భోగి మంటల చుట్టూ బారులు తీరుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా ఐదవ రోజు 7 డిగ్రీల సెల్సియస్‌కు దగ్గరగా నమోదయ్యాయని ఆయన చెప్పారు
గుణ, సత్నా, డాటియా, జబల్‌పూర్, సాగర్ మరియు ఛతర్‌పూర్ జిల్లాల్లో దట్టమైన పొగమంచు, చల్లటి వాతావరణం నెలకొంది. గ్వాలియర్, రేవా, ఛతర్‌పూర్ జిల్లాలోని నౌగావ్ పట్టణంలో ఒక మోస్తరు పొగమంచు కమ్ముకుంది. భోపాల్, ఇండోర్‌లలో కనిష్ట ఉష్ణోగ్రతలు 7.3, 10.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. అయితే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్‌లో మంచు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఈశాన్య గాలులతో ఉష్ణోగ్రతలు తగ్గాయని వాతావరణ అధికారులు తెలిపారు. మరో మూడు రోజుల పాటు చలి తీవ్రత ఇలాగే కొనసాగే అవకాశం ఉందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment