మహారాష్ట్రలో నేడే పోలింగ్
అధికార మహాయుతి, విపక్ష ఎంవీఏ హోరాహోరీ
శనివారం ఓట్ల లెక్కింపు, అదే రోజు ఫలితాల వెల్లడి
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. 288 అసెంబ్లీ స్థానాలకు బుధవారం ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. బీజేపీ సారథ్యంలోని అధికార మహాయుతి, కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) భాగ్యరేఖలను 9.7 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు. రాష్ట్రమంతటా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఎన్నికల అధికారులు తెలిపారు.
హోరెత్తిన ప్రచారం
మహాయుతి తరఫున ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మహారాష్ట్రలో కాలికి బలపం కట్టుకుని తిరిగారు. ముమ్మర ప్రచారంతో హోరెత్తించారు. వారితో పాటు కేంద్ర మంత్రులు, పలు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు తదితరులు కూడా ప్రచార పర్వంలో చురుగ్గా పాల్గొన్నారు. ఎంవీఏ కూటమి కోసం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్ర నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ వద్రా ప్రచారం చేశారు.
గత అసెంబ్లీ ఎన్నికల అనంతర పరిణామాల్లో ముందుగా శివసేన, అనంతరం ఎన్సీపీల్లో చీలిక రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించడం ద్వారా తమదే అసలైన పార్టీ అని నిరూపించుకునేందుకు షిండే, ఉద్ధవ్ సేనలు; శరద్ పవార్, అజిత్ ఎన్సీపీ వర్గాలు పట్టుదలగా ఉన్నాయి. ఈ ఎన్నికలు వాటికి ఒకరకంగా జీవన్మరణ సమస్యేనని చెప్పాలి.
18–65 ఏళ్ల మధ్య వయసు మహిళలకు నెలకు రూ.1,500 ఆర్థిక సాయం అందిస్తున్న లడ్కీ బహన్ పథకంపైనే మహాయుతి ప్రధానంగా ఆశలు పెట్టుకుంది. మళ్లీ గెలిస్తే ఆ మొత్తాన్ని రూ.2,100కి పెంచుతామని పేర్కొంది. దీనికి విరుగుడుగా తాము మహిళలకు ఏకంగా నెలకు రూ.3,000 ఇస్తామని ఎంవీఏ ప్రకటించింది. మతపరమైన మనోభావాలను రేకెత్తించేందుకు కూడా బీజేపీ శాయశక్తులా ప్రయత్నించింది. అందులో భాగంగా బటేంగే తో కటేంగే, ఏక్ హై తో సేఫ్ హై వంటి నినాదాలు ప్రధానితో పాటు ఆ పార్టీ అగ్ర నేతలందరి నోటా ప్రచారం పొడవునా పదేపదే వినిపించాయి. ఇది సమాజంలో మతపరమైన చీలిక యత్నమేనంటూ రాహుల్‌తో పాటు ఎంవీఏ నేతలంతా దుయ్యబట్టారు.
పార్టీల కోలాటం
మహాయుతి పక్షాల్లో బీజేపీ అత్యధికంగా 149 అసెంబ్లీ స్థానాల్లో బరిలో ఉంది. శివసేన (షిండే) 81, ఎన్సీపీ (అజిత్) 59 చోట్ల పోటీ చేస్తున్నాయి. ఎంవీఏ కూటమి నుంచి కాంగ్రెస్ అత్యధికంగా 101 స్థానాల్లో, శివసేన (యూబీటీ) 95, ఎన్సీపీ (ఎస్‌పీ) 86 చోట్ల పోటీలో ఉన్నాయి. వీటితో పాటు బరిలో ఉన్న పలు చిన్న పార్టీలు ఈసారి పెద్ద ప్రభావమే చూపేలా కన్పిస్తుండటం విశేషం.
జార్ఖండ్‌లో రెండో విడత 38 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్
రాంచీ: జార్ఖండ్‌లో బుధవారం రెండో, తుది విడతలో 38 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. శనివారం మహారాష్ట్రతో పాటే ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వెల్లడవనున్నాయి. రాష్ట్రంలో నవంబర్ 13న తొలి విడతలో 43 సీట్లలో పోలింగ్ ముగియడం తెలిసిందే. జేఎంఎం సారథ్యంలోని పాలక ఇండియా కూటమిని ఎలాగైనా ఓడించాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సంకీర్ణం పట్టుదలగా ఉంది. ఇరు కూటముల నేతలూ సోమవారం రాత్రి దాకా ఇంటింటి ప్రచారంతో హోరెత్తించారు.
Comments
Please login to add a commentAdd a comment