![Maharashtra CM Uddhav Thackeray Suspects Over Ambani Bomb Scare - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/9/CM-Uddhav-Thackeray.jpg.webp?itok=mSopjf2N)
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో కూడిన కారుబాంబు కేసును కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు అప్పగించింది. దీంతో ఎన్‌ఐఏ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. ఈ వ్యవహారంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సోమవారం స్పందించారు. రాష్ట్ర పోలీసు శాఖ విచారించగల కేసును ఎన్‌ఐఏకు అప్పగించడం చూస్తే ఏదో తేడా కొడుతోందని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయని.. కానీ అధికారులు ఎల్లప్పుడూ ఉంటారని ఎన్‌ఐఏను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ కేసులో ఆటో పార్ట్స్ డీలర్ మన్సుఖ్ హిరాన్ మరణోదంతాన్ని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్)కు అప్పగించామని, ఈ నేపథ్యంలో ఎన్‌ఐఏకు కేసు వెళ్లడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. హిరాన్ మరణంపై ఏటీఎస్ ఆదివారమే కేసు నమోదు చేసిందని, దానిపై ఏటీఎస్ విచారణ కొనసాగుతుందని అన్నారు.
రాష్ట్ర యంత్రాంగం ఈ కేసును విచారించగలదని ప్రతిపక్ష బీజేపీ విశ్వసించడం లేదని, అది పనిచేయడం లేదని చూపించాలని అనుకుంటోందని విమర్శించారు. ఒకవేళ వారు అలా భావిస్తే ఇంధన ధరలపై రాష్ట్ర ప్రభుత్వమే పన్నులను తగ్గించాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారని ప్రశ్నించారు. ఏడు సార్లు ఎంపీగా గెలుపొందిన మోహన్ దేల్‌కరంద్ ఆత్మహత్య చేసుకోవడంపై కూడా రాష్ట్ర పోలీసులు విచారణ జరుపుతున్నారని, అన్ని వివరాలను బయటపెడతామని అన్నారు. అన్నిసార్లు ఎంపీగా గెలిచిన వ్యక్తి మరణంపై బీజేపీ ఎందుకు వ్యూహాత్మక మౌనం వహిస్తోందని ప్రశ్నించారు.
చదవండి:
అంబానీ ఇంటి వద్ద కలకలం రేపిన స్కార్పియో ఓనర్ మృతి
Comments
Please login to add a commentAdd a comment