సాక్షి, ముంబై: రాజ్యసభ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవడంతో మహారాష్ట్రలో ఏకంగా 24 ఏళ్ల తరువాత ఎన్నికలు జరుగుతున్నాయి. గత 24 ఏళ్ల నుంచి అధికార, ప్రతిపక్షాలు సమన్వయంతో రాజ్యసభ సభ్యులను ఏకగ్రీవంగానే ఎన్నుకుంటూ వస్తున్నాయి. కానీ ఈసారి బీజేపీ, శివసేన మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్ధితి నెలకొంది. దీంతో ఇరు పార్టీల నేతలు చర్చలు జరిపారు. ఒకరికొకరు ఆఫర్లు ఇచ్చుకున్నప్పటికీ వెనక్కి తగ్గకపోవడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఫలితంగా రాజ్యసభ ఎన్నికల పోరు మరింత రసవత్తరమైంది.
కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు గడువు విధించింది. ఆలోపు చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు మహావికాస్ ఆఘాడి సీనియర్ నేతలు ఛగన్ భుజబల్, సునీల్ కేదార్ తదితరులు ప్రతిపక్షనేత దేవేంద్ర ఫడ్నవీస్ నివాసమైన సాగర్ బంగ్లాలో చర్చలు జరిపారు. అయినప్పటికీ బీజేపీ, శివసేన నామినేషన్లు ఉపసంహరించుకోకపోవడంతో ఎన్నికలు అనివార్యమైన సంగతి తెలిసిందే. రాజ్యసభకు అభ్యర్ధులను మూజువాణి ఓటు పద్ధతిలో ఎన్నుకోవాలని చట్టం రూపొందించిన తరువాత ఎన్నికలు జరగడం ఇదే ప్రథమం. 1998లో రాజ్యసభ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ పద్ధతిలో జరిగాయి. ఇప్పుడు ఏకంగా 24 ఏళ్ల తరువాత మొదటిసారి ఎన్నికలు జరుగుతున్నాయి.
చదవండి: అక్కడ బడికి పోతే బస్సెక్కినట్లే.. ఎందుకంటే!
మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్ధానాలున్నాయి. అందులో ఇటీవల విదేశీ పర్యటనకు వెళ్లిన ముంబైలోని తూర్పు అంధేరీ నియోజక వర్గం శివసేన ఎమ్మెల్యే రమేశ్ లట్కే గుండెపోటుతో అక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో రమేశ్ స్ధానం ఖాళీగా ఉండటంతో ప్రస్తుతం అసెంబ్లీలో 287 మంది సభ్యులున్నారు. మహారాష్ట్రకు చెందిన ఆరు రాజ్యసభ స్ధానాలకు ఈ నెల 10న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. బీజేపీ, శివసేన ఇద్దరు చొప్పున, కాంగ్రెస్, ఎన్సీపీ ఒక్కొక్కరు చొప్పున ఇలా ఆరుగురు సభ్యులు నామినేషన్లు వేయాల్సి ఉంది. కానీ అసెంబ్లీలో తమకు సంఖ్యా బలం ఎక్కువ ఉందని భావించిన బీజేపీ మూడో అభ్యర్ధిని బరిలో దింపింది.
కేవలం 11–12 ఓట్లు తక్కువవుతున్నాయి. ఎలాగైనా ఆ ఓట్లను రాబట్టుకుని మూడో అభ్యర్ధిని గెలిపించుకుంటామని బీజేపీ స్పష్టం చేసింది. దీంతో ఓట్ల కొనుగోలుపై భారీగా ఆర్ధిక లావాదేవీలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో తమ ఎమ్మెల్యేలు అమ్ముడుపోకుండా మహావికాస్ ఆఘాడి ప్రభుత్వానికి చెందిన మంత్రులు, నేతలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
మహావికాస్ ఆఘాడి ప్రభుత్వంలో మిత్రపక్షాలైన శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీకి చెందిన ఎమ్మెల్యేలందరినీ ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ముంబైలోని ఓ రహస్య ప్రాంతంలో ఒకే చోట ఉంచనున్నారు. ఓట్లు చీలిపోకుండా, బేరమాడకుండా సెల్‌ఫోన్‌లో జరిగే సంభాషణలపై కూడా దృష్టిసారించనున్నారు. బీజేపీ, శివసేన ఇరు పార్టీలు ఓ అభ్యర్థిని ఉప సంహరించుకోకపోవడంతో ఆరో అభ్యర్ధి గెలుపు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఆరో అభ్యర్ధిని గెలిపించుకునేందుకు బీజేపీ, శివసేన తమ ప్రతిష్టను ఫణంగా పెట్టాయి.
అసెంబ్లీలో బలాబలాలు...
రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్ధానాలుండగా అందులో బీజేపీ–106, శివసేన–55, ఎన్సీపీ–54, కాంగ్రెస్–44 మొత్తం 259 ఎమ్మెల్యేలున్నారు. మిగతా చిన్న చితకా పార్టీలకు చెందిన 16 మంది ఎమ్మెల్యేలు, 13 మంది ఇండిపెండెంట్లు ఇలా 29 మందితో కలిసి మొత్తం 288 మంది ఉన్నారు. ఇందులో బహుజన్ వికాస్ ఆఘాడి–3, ఎంఐఎం–2, సమాజ్‌వాది పార్టీ–2, ప్రహార్ జనశక్తి పార్టీ–2, ఎమ్మెన్నెస్–1, ఆర్‌ఎస్‌పీ–1, క్రాంతికారి శేత్కరీ పార్టీ–1, జనసురాజ్య పార్టీ–1, కమ్యూనిస్టు పార్టీ–1, శేత్కరి కామ్‌గార్ పార్టీ–1, సీపీఐ (ఎం)–1 ఇలా మొత్తం 16 చిన్నాచితకా పార్టీల ఎమ్మెల్యేలున్నారు. వీరంతా ఎవరికి మద్దతునిస్తారన్న దానిపై రాజ్యసభ సభ్యుల భవిత ఆధారపడి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment