Border Row: Maharashtra Suspends RTC Bus Services To Karnataka - Sakshi
Sakshi News home page

మహారాష్ట్ర-కర్నాటక సరిహద్దుల్లో హైఅలర్ట్‌.. బస్సులు బంద్‌

Published Wed, Dec 7 2022 11:15 AM | Last Updated on Wed, Dec 7 2022 2:44 PM

Maharashtra Suspends RTC Bus Services To Karnataka - Sakshi

మహారాష్ట్ర, కర్ణాటక మధ్య సరిహద్దు వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. రెండు రాష్ట్రాల అనుకూలవాదులు నిరసన ప్రదర్శనలు చేపట్టడం, వాహనాలపై పరస్పరం దాడులకు దిగడంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో, శాంతి భద్రతలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏక్‌నాథ్‌ షిండే, బసవరాజ బొమ్మై నిర్ణయించుకున్నారు. ఇరువురు నేతలు మంగళవారం రాత్రి ఫోన్‌ద్వారా మాట్లాడుకున్నారు. సరిహద్దుల్లో నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చించుకున్నారు.   

 మరోవైపు.. మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సులపై కర్నాటకలో నిరసనకారులు దాడులు చేస్తున్న కారణంగా మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర నుంచి కర్నాటకకు బస్సు సర్వీసులను నిలిపేస్తున్నట్టు మహారాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్టుమెంట్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, కర్నాటకలో ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. దాడుల నేపథ్యంలో మహారాష్ట్ర పోలీసులు హెచ్చరించిన కారణంగానే తాము బస్సు సర్వీసులను నిలిపివేశామని తెలిపారు. మళ్లీ పోలీసులు క్లియరెన్స్‌ ఇచ్చిన తర్వాతనే బస్సు సర్వీసులను పునఃప్రారంభిస్తామని అధికారులు స్పష్టం చేశారు.

ఏమిటీ వివాదం?  
రెండు రాష్ట్రాల నడుమ సరిహద్దు వివాదం 1957 నుంచి కొనసాగుతోంది. ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న బెళగావితోపాటు మరాఠా భాష మాట్లాడే ప్రజలు అధికంగా ఉన్న 814 గ్రామాలు స్వాతంత్య్రం కంటే ముందు అప్పటి బాంబే ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేవి. బెళగావి నగరాన్ని, 814 గ్రామాలను కర్ణాటకలో 1957లో విలీనం చేశారు. కానీ, అవి తమవేనని మహారాష్ట్ర వాదిస్తోంది. వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. బెళగావి తమ రాష్ట్రంలో అంతర్భాగమని కర్ణాటక వాదిస్తోంది. అంతేకాదు అక్కడ బెంగళూరులోని విధాన సౌధను పోలిన సువర్ణ విధాన సౌధను నిర్మించింది. ఏడాదికోసారి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement