సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా రోగుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టడంతో పౌరులకు ఊరట కలిగించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నమోదవుతున్న కొత్త కరోనా రోగుల సంఖ్య, రికవరీ శాతాన్ని బట్టి లాక్‌డౌన్ నిబంధనలు సడలించింది. దీంతో గత సంవత్సరం మార్చి నుంచి స్తంభించిపోయిన వ్యాపార ఆర్థిక లావాదేవీలు, ఉపాధి కోసం జనాల పరుగులు పుంజుకుంటాయి. సడలించిన నిబంధనలు సోమవారం నుంచి అమలులోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అన్‌లాక్ ప్రటకనల గందరగోళం!
రాష్ట్రంలో ఐదు దశల్లో అన్‌లాక్ ప్రక్రియ అమలు చేస్తున్నట్లు గురువారం సహాయ, పునరావాస శాఖ మంత్రి విజయ్ వడెట్టివార్ చేసిన ప్రకటన గందరగోళానికి దారితీసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన చేసిన రెండు గంటల్లోనే ముఖ్యమంత్రి కార్యాలయం లాక్‌డౌన్ ఇంకా కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఇలా వేర్వేరు ప్రకటనలతో ప్రతిపక్షాలు ఘాటుగా స్పందించాయి. దీంతో తేరుకున్న వడెట్టివార్ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అంతేగాకుండా ఈ వివాదస్పద ప్రకటనపై విజయ్ వడెట్టివార్‌ను ఉప ముఖ్యమంత్రి అజీత్ పవార్ కూడా వెనకేసుకొచ్చే ప్రయత్నం చేసిన సంగతి విదితమే. ప్రభుత్వం పూర్తి సమన్వయంతో పనిచేస్తుందని, ఎన్ని పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పడిందనేది ముఖ్యం కాదని, ముఖ్యమంత్రి తీసుకునే అంతిమ నిర్ణయాన్నే అందరూ ఆమోదిస్తారని స్పష్టం చేశారు. లాక్‌డౌన్ ఎత్తివేసే అంశంపై ఆలోచిస్తున్నామని పవార్ వెల్లడించారు. చివరకు ఊహించిన విధంగానే లాక్‌డౌన్ నిబంధనలు పడలిస్తున్నట్లు శనివారం ప్రకటించింది.
ఐదు ఫేజ్‌లుగా అన్‌లాక్
అన్‌లాక్ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఐదు ఫేజ్‌లుగా విభజించింది. ఐదు శాతం పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాలను మొదటి ఫేజ్‌గా గుర్తించింది. ఈ జిల్లాలను సోమవారం నుంచి పూర్తిగా అన్‌లాక్ చేసింది. ఇందులో రాష్ట్ర ఉప రాజధాని నాగ్‌పూర్ సహా 12 జిల్లాలున్నాయి. కానీ ముంబై, థానే, పుణే నగరాలకు పెద్దగా ఊరట లభించలేదు. ముంబై లోకల్ రైళ్లలో సామాన్య ప్రజలకు అమలులో ఉన్న నిషేధాన్ని అలాగే కొనసాగించింది. దీంతో ముంబైకర్లకు మళ్లీ నిరాశే మిగిలింది. ముంబై, థానేలో మాల్స్, నాట్యగృహాలు, సినిమా హాళ్లు పూర్తిగా మూసే ఉంటాయి. ప్రైవేటు కార్యాలయాల్లో 50 శాతం హాజరుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. కాని దీనిపై తుది నిర్ణయం తీసుకునే అధికారం స్థానిక సంస్థలకు ఇచ్చింది. కానీ దీనిపై బీఎంసీ ఇంతవరకు ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. అలాగే కొత్త నిబంధనల ప్రకారం సాయంత్రం ఐదు గంటల తరువాత కర్ఫ్యూ కొనసాగనుంది. ఈ సమయంలో జనాలు ఇళ్ల నుంచి అనవసరంగా బయటకురావొద్దు.
ఐదు ఫేజ్‌లు– జిల్లాలు
►ఫేజ్–1లో అన్ని నిబంధనలు రద్దు. ఇందులో నాగ్‌పూర్, అహ్మదాబాద్, చంద్రాపూర్, ధులే, గోందియా, జల్గావ్, జాల్నా, లాతూర్, నాందేడ్, యవత్మాల్ జిల్లాలున్నాయి.
►ఫేజ్–2లో అనేక నిబంధనలు రద్దు. ఇందులో హింగోలి, నందూర్బార్ జిల్లాలున్నాయి.
►ఫేజ్–3లో షాపులు సాయంత్రం 4 గంటల వరకు తెరిచి ఉంచేందుకు అనుమతి. ఇందులో ముంబై, థానే, నాసిక్, పాల్ఘర్, వర్ధా, అకోలా, అమరావతి, ఔరంగాబాద్, బీడ్, భండారా, గడ్చిరోలి, ఉస్మానాబాద్, పర్భణీ, షోలాపూర్, వాషిం జిల్లాలున్నాయి.
►ఫేజ్–4లో షాపులు సాయంత్రం 4 గంటల వరకు తెరిచి ఉంటాయి. ఇతర వ్యవహారాలకు అనుమతి లేదు. ఇందులో పుణే, బుల్డాణ, కోల్హాపూర్, రాయ్‌గడ్, రత్నగిరి, సాంగ్లీ, సాతారా, సిందుధుర్గ్ జిల్లాలున్నాయి.
►ఫేజ్–5లో సోమవారం నుంచి శుక్రవారం వరకు సాయంత్రం 4 గంటల వరకు షాపులు తెరిచి ఉంటాయి. ఇందులో ఇంతవరకూ ఏ జిల్లాలు లేవు.
ఐదు ఫేజ్‌లు
►ఫేజ్–1లో వారంలో కరోనా రోగులు 5 శాతానికంటే తక్కువ నమోదు కావాలి. ఆక్సీజన్ బెడ్లలో 25 శాతానికి కంటే తక్కువ రోగులుండాలి.
►ఫేజ్–2లో వారంలో 5 శాతానికంటే తక్కువ రోగులు నమోదు కావాలి. ఆక్సిజన్ బెడ్లలో 25–40 శాతం రోగులుండాలి.
►ఫేజ్–3లో వారంలో 5–10 శాతం రోగులు నమోదు కావాలి. ఆక్సిజన్ బెడ్లలో 40 శాతానికిపైగా రోగులుండాలి.
►ఫేజ్–4లో వారంలో 10–20 శాతం రోగులు నమోదు కావాలి. ఆక్సిజన్ బెడ్ల వినియోగం 60 శాతాని కంటే పైగా ఉండాలి.
►ఫేజ్–5లో వారంలో 20 శాతానికంటే ఎక్కువ రోగులు, ఆక్సిజన్ బెడ్లు 75 శాతానికిపైగా రోగులతో ఉండాలి.
తాజా సడలింపులివీ..
►అత్యవసర సేవలందించే షాపులు రోజు సాయంత్రం నాలుగు గంటల వరకు తెరిచి ఉంటాయి.
►ఇతర షాపులు సోమవారం నుంచి శుక్రవారం వరకు సాయంత్రం నాలుగు గంటల వరకు తెరిచి ఉంటాయి. శని, ఆదివారాలు మూసి ఉంటాయి.
►రెస్టారెంట్లు సోమవారం నుంచి శుక్రవారం వరకు సాయంత్రం నాలుగు గంటల వరకు 50 శాతం సిట్టింగ్‌తో నిర్వహించుకోవచ్చు. హోం డెలివరీ/ పార్సిల్ సేవలు కొనసాగించొచ్చు.
►సార్వజనిక మైదానాలు, ఉద్యాన వనాలు, వాకింగ్ ట్రాక్‌లు ఉదయం 5 నుంచి తొమ్మిది వరకు తెరిచి ఉంటాయి.
►వ్యాయామ శాలలు, సెలూన్లు, బ్యూటీ పార్లర్లు సాయంత్రం 4 గంటల వరకు, 50 శాతం సిట్టింగు, ఏసీ షాపులు బంద్.
►సినిమాలు, సీరియళ్ల షూటింగులకు స్టూడియోల్లో సాయంత్రం 5 గంటల వరకు అనుమతి.
►సాంస్కృతిక కార్యక్రమాలకు సోమవారం నుంచి శుక్రవారం వరకు సాయంత్రం 4 గంటల వరకు అనుమతి. 50 శాతం సిట్టింగ్.
►పెళ్లిలు, ఇతర శుభ కార్యాలకు ఫంక్షన్ హాలు సామర్థ్యాన్ని బట్టి 50 శాతం అనుమతి. అంత్యక్రియలకు కేవలం 20 మందికే అనుమతి.
►బెస్ట్ బస్సుల్లో వంద శాతం అనుమతి, స్టాండింగ్‌కు అనుమతి లేదు.
►అన్ని రకాల ఆన్‌లైన్ కోనుగోళ్లకు పూర్తి స్థాయిలో అనుమతి.
Comments
Please login to add a commentAdd a comment