కోల్‌కతా: ఒక రాజకీయ పార్టీ కావాలనే తన మీద బురద చల్లే ప్రయత్నం చేస్తుందని.. దానిలో భాగంగానే తాను ఈ ఏడాది దుర్గా పూజకు అనుమతివ్వలేదని అబద్ధాలు ప్రచారం చేస్తుందని నిప్పులు చెరిగారు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఈ ఏడాది దుర్గాపూజ వద్దని తాను అన్నట్లుగా నిరూపిస్తే.. ప్రజల ముందు 101 సార్లు గుంజీలు తీస్తానని సవాలు చేశారు దీదీ. బెంగాల్ పోలీస్ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దీదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఏడాది సెప్టెంబర్ 1న బెంగాలో పోలీసు డే నిర్వహిస్తారు. కానీ ఈ ఏడాది మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణంతో ఈ కార్యక్రమం నేటికి వాయిదా పడింది. ఈ సందర్భంగా దీదీ కోల్‌కతా పోలీసుల ధైర్య సాహసాలను ప్రశంసించారు. కోవిడ్ నియంత్రణ కోసం వారు ఎంతో కృషి చేస్తున్నారు అన్నారు. అనంతరం దుర్గా పూజపై వస్తోన్న ఆరోపణలపై స్పందించారు దీదీ. (చదవండి: కరోనా కట్టడిలో మహిళా నేతలు భేష్!)
అక్టోబర్ నెలలో వస్తున్న దసరా పండగను ప్రతి ఏటా కోల్‌కతాలో ఘనంగా నిర్వహించే విషయం తెలిసిందే. అయితే దసరా సందర్భంగా జరిపే దుర్గా పూజపై ఇప్పటి వరకు తాను ఎలాంటి సమావేశం జరుపలేదని, ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మమత స్పష్టంచేశారు. కరోనా కారణంగా ఈసారి దుర్గా పూజను రద్దు చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆమె కొట్టిపారేశారు. ఓ రాజకీయ పార్టీ దురుద్దేశంతోనే దీనిపై తప్పుడు వదంతులు ప్రచారం చేస్తున్నదని.. ప్రజలు వాటిని నమ్మవద్దని మమత వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment