
ఒక వ్యక్తి ప్రాణాలను వీధి శునకాలు కాపాడిన ఒక విచిత్రమైన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది.
ఉత్తరప్రదేశ్: ఒక యువకుడి ప్రాణాలను వీధి శునకాలు కాపాడిన విచిత్ర ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన 24 ఏళ్ల రూప్ కిశోర్‌పై జూలై 18న అర్టోని ప్రాంతంలో అంకిత్, గౌరవ్, కరణ్, ఆకాశ్ అనే నలుగురు యువకులు కత్తులతో దాడికి పాల్పడ్డారు.
రూప్ కిశోర్ మృతి చెందాడని భావించిన నిందితులు ఒక ప్రాంతంలో పాతిపెట్టి వెళ్లిపోయారు. అక్కడకు వచ్చిన కొన్ని వీధి కుక్కలు అక్కడ మట్టి తవ్వాయి.. ఆ యువకుడి శరీరాన్ని కొరకడంతో స్పృహ వచ్చింది. దీంతో అతడు స్థానికుల వద్దకు వెళ్లి పరిస్థితిని వివరించడంతో వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు.
రూప్ కిశోర్ తల్లి స్పందిస్తూ.. తన కుమారుడిని నలుగురు బలవంతంగా తీసుకెళ్లి దాడి చేశారన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితులు కోసం గాలిస్తున్నారు.