భోపాల్: విద్యుత్తు వైర్లు తగలకుండానే ఓ వ్యక్తికి షాక్ తగిలింది. అది ఎలాగనుకుంటున్నారా? తన ఇంటి కరెంట్ బిల్లు చూసి షాక్‌తో ఆసుపత్రి పాలయ్యాడు. ఇంతకి అతని బిల్లు ఎంతనుకుంటున్నారా? రూ.3,419 కోట్లు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. గ్వాలియర్‌లోని శివ విహార్ కాలనీకి చెందిన ప్రియాంక గుప్తా ఇంటి విద్యుత్తు బిల్లు రూ.3,419 కోట్లు వచ్చినట్లు తెలుసుకుని షాకయ్యారు. ఆమె మామ ఏకంగా మూర్చపోయి ఆసుపత్రిలో చేరాడు. అయితే.. ఇది మానవ తప్పిదం వల్ల జరిగిందని విద్యుత్తు సంస్థ తెలిపింది. సవరించిన బిల్లు రూ.1,300గా ఇవ్వటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు గుప్తా కుటుంబ సభ్యులు.
గృహ వినియోగానికి సంబంధించిన విద్యుత్తు బిల్లు కోట్లలో రావటం చూసి షాక్‌కి గురైన తన తండ్రి ఆసుపత్రిపాలయ్యాడని గుప్తా భర్త సంజీవ్ కంకానే పేర్కొన్నారు. జులై 20న తమకు ఇంటి విద్యుత్తు బిల్లు వచ్చిందన్నారు. భారీ మొత్తంలో ఉండటంతో మధ్యప్రదేశ్ క్షేత్ర విద్యుత్తు వితరన్ కంపెనీ(ఎంపీఎంకేవీవీసీ) పోర్టల్‌లో తనిఖీ చేయగా.. సవరించినట్లు కనిపించిందని తెలిపారు. విద్యుత్తు బిల్లు భారీగా వచ్చేలా నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు ఎంపీఎంకేవీవీసీ జెనరల్ మేనేజర్ నితిన్ మంగ్లిక్. ‘యూనిట్స్ స్థానంలో వినియోగదారుడి నంబర్ ఎంటర్ చేయటం వల్ల ఇలా జరిగింది. అందుకే భారీగా బిల్లు వచ్చింది. సవరించిన బిల్లు రూ.1,300 సంబంధిత వినియోగదారుడికి ఇచ్చాం.’ అని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఇదీ లక్కంటే.. అప్పులపాలై ఇల్లు అమ్మకానికి పెట్టగా రూ.కోటి లాటరీ
Comments
Please login to add a commentAdd a comment