
పుణె: ఏం కష్టమొచ్చిందో కానీ ముక్కుపచ్చలారని కూతుళ్లను బావిలోకి తోసేసి ఆపై అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని పుణెలో జరిగింది. తినడానికి వంట చేయి అని ఇంట్లోంచి ఇద్దరు పిల్లలతో వెళ్లిన ఆయన శవమై ఇంటికి తిరిగొచ్చాడు. ఒకేసారి ముగ్గురి మృతితో ఆ కుటుంబం దుఃఖసాగరంలో మునిగింది. అయితే కుటుంబ కలహాలే ఆయన ఇంతటీ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
పుణెకు సమీపంలోని తాలేగావ్ ధందేర్‌లో రాజేంద్ర బుజ్బాల్ (42) నివసిస్తున్నాడు. అతడికి ఇద్దరు కుమార్తెలు దీక్ష (10), రితుజ (8). కూతుళ్లతో కలిసి గురువారం సాయంత్రం రాజేంద్ర బయటకు వెళ్లాడు. భోజనం సమయమైనా ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు గాలించారు. ఈ సందర్భంగా పొలం సమీపంలో ఉన్న బావి వద్ద వారికి సంబంధించిన వస్తువులు లభించాయి. వెంటనే బావిలోకి చూడగా ముగ్గురి మృతదేహాలు బావిలో తేలుతున్నాయి. మొదట ఇద్దరు కూతుళ్లను బావిలోకి విసిరేసిన అనంతరం ఆయన బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని శిఖర్‌పూర్ పోలీసులు భావిస్తున్నారు. అయితే కుటుంబ కలహాలే అతడు ఇంత ఘాతుకానికి ఒడిగట్టాడని తెలుస్తోంది. భార్యాభర్తల మధ్య మనస్ఫర్థలు ముగ్గురి ప్రాణాలు తీశాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment