సాక్షి, ఢిల్లీ: ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రహోం మంత్రి అమిత్ షా కీలక నిర్ణయం తీసుకున్నారు. మణిపూర్ ఘర్షనల నేపథ్యంలో నేడు(శనివారం) అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. మరోవైపు.. శుక్రవారం కూడా మరోసారి మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
వివరాల ప్రకారం.. హింసాకాండతో అట్టుడుకుతున్న మణిపూర్ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని, సాధారణ స్థితిని పునరుద్ధరించే మార్గాలపై ఆలోచించడమే అఖిలపక్ష సమావేశం ఉద్దేశమని అమిత్ షా చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరగనుందని తెలిపారు. అయితే, మణిపూర్ ఘర్షణల తర్వాత అఖిలపక్ష సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి. ఇక, ఈ సమావేశానికి ఏపీ నుంచి వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి, తెలంగాణ నుంచి బీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎంపీ వినోద్ హాజరుకానున్నారు.
ఇదిలా ఉండగా.. మణిపూర్‌లో హింసాత్మక ఘటన నేపథ్యంలో తొమ్మిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. నోంగ్‌తోంబమ్ బీరెన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలు పూర్తిగా విశ్వాసం కోల్పోయారని వారు విమర్శలు చేశారు. ఐదు అంశాలతో కూడిన మెమోరాండంను మోదీకి సమర్పించిన ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై, పరిపాలనపై తమకు నమ్మకం లేదన్నారు. చట్టపరంగా పరిపాలన అనుసరించడం ద్వారా సరైన పరిపాలన, ప్రభుత్వ పనితీరు కోసం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, తద్వారా ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందవచ్చు అని లేఖలో వివరించారు. కాగా, ఈ ఎమ్మెల్యేలంతా మైతి సామాజిక వర్గానికి చెందినవారు కావడం విశేషం.
లేఖపై సంతకాలు చేసిన ఎమ్మెల్యేలు వీరే..
- కరమ్ శ్యామ్ సింగ్,
- తోక్‌చోమ్ రాధేశ్యామ్ సింగ్,
- నిషికాంత్ సింగ్ సపం,
- ఖ్వైరక్‌పం రఘుమణి సింగ్,
- ఎస్. బ్రోజెన్ సింగ్,
- టీ. రవీంద్రో సింగ్,
- ఎస్, రాజేన్ సింగ్,
- ఎస్. కేబీ దేవి,
- వై. రాధేశ్యామ్.
ఇది కూడా చదవండి: ఇండిగో విమానంలో మహిళకు గుండెపోటు.. సీపీఆర్ చేయడంతో..
Comments
Please login to add a commentAdd a comment