
మైసూరు: భర్త, అత్తమామల ధన దాహానికి నిండు ప్రాణం బలైంది. కోటి ఆశలతో అత్తవారింట అడుగుపెట్టిన యువతి అర్ధాంతరంగా తనువు చాలించాల్సి వచ్చింది. ఈ దారుణం మైసూరు జిల్లాలోని నంజనగూడు తాలూకాలోని హుల్లహళ్ళి గ్రామంలో జరిగింది. మమత (20) అనే వివాహిత యువతి మెట్టినింట వేధింపులతో అనుమానాస్పద రీతిలో శవమైంది.
డబ్బు తేవాలని వేధింపులు
వివరాలు.. 2021 మార్చిలో మమతకు, ప్రేమచంద్ర నాయకతో పెద్దలు పెళ్లి చేశారు. 30 గ్రాముల బంగారం, రూ. 80 వేల నగదు కట్నంగా ఇవ్వడంతో పాటు పెళ్ళి ఘనంగా జరిపించారు. కొన్ని నెలల తరువాత మమతకు వేధింపులు మొదలయ్యాయి. పుట్టింటి నుంచి మరింత డబ్బు తేవాలని భర్త ఆమెను కొట్టేవాడు. అత్త మామ కూడా కొడుక్కే వంతపాడేవారు తప్ప సర్దిచెప్పలేదు. మమత గర్భం దాల్చిందని తెలిసి బలవంతంగా అబార్షన్ చేయించారు.
చవితి రోజున ఘోరం
విషయం తెలుసుకున్న మమత తల్లిదండ్రులు కుమార్తెను పుట్టింటికి తీసుకెళ్లారు. తరువాత తప్పయిందని, బాగా చూసుకుంటానని చెప్పడంతో భర్త వెంట వెళ్లింది. ఏం జరిగిందో కానీ వినాయక చవితి రోజున ఉరివేసుకున్న స్థితిలో శవమై తేలింది. వెంటనే భర్త, అత్తమామ, ఇద్దరు ఆడపడుచులు ఇంటి నుంచి పారిపోయారు. తరువాత తల్లిదండ్రులు కుమార్తె మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు. ఈ నేపథ్యంలో భర్త, అత్తమామలు తన కుమార్తెను హత్య చేశారని మమత తండ్రి శుక్రవారంరోజున పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. హుల్లహళ్ళి పోలీసులు ప్రేమచంద్ర నాయకతో పాటు అతని తండ్రి శంకరనాయక, యశోద, అనుజ, ప్రేమ అనేవారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment