సాక్షి, ఢిల్లీ: కోవిడ్ విజృంభిస్తోన్న వేళ కరోనా కట్టడికి కేంద్రం ప్రభుత్వం మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా ప్రారంభించింది. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికి టీకా ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించినప్పటికి వాస్తవంగా అది సాధ్యం కాదంటున్నాయి పలు రాష్ట్రాలు. ప్రస్తుతం 45 ఏళ్లు పైబడిన వారికి టీకా కార్యక్రమం ఇంకా కొనసాగుతూనే ఉంది. వారికే సరిపడా వ్యాక్సిన్‌లు లేవు. ఈ నేపథ్యంలో మే 1 నుంచి 18 ఏళుల పైబడిన వారందరికి వ్యాక్సిన్ అందించడం సాధ్యం కాదని పలు రాష్ట్రాలు కేంద్రానికి విన్నవించాయి.
ఈ క్రమంలో ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడో దశ వ్యాక్సినేషన్ కోసం తమ దగ్గర టీకాలు లేవని.. అందువల్ల మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సత్యేంద్ర జైన్ మాట్లాడుతూ.. ‘‘ప్రసుత్తం మా దగ్గర టీకాలు లేవు. వ్యాక్సిన్‌లకు సంబంధించి కంపెనీలకు అభ్యర్థనలు పంపాం. ఎప్పుడు వస్తాయో త్వరలోనే చెప్తాం. ఒకటి, రెండు రోజుల్లో దీనిపై స్పష్టత ఇస్తాం’’ అన్నారు.
ఇక ఢిల్లీలో 18 ఏళ్లు పైబడిన వారందరికి కేజ్రీవాల్ ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తమకు 1.34 కోట్ల టీకాలు అవసరం అవుతాయని కేజ్రీవాల్ టీకా కంపెనీలను కోరారు. ఇక ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో 25,986 కేసులు వెలుగు చూడగా.. 368 మంది మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment