లక్నో : అయోధ్యలో రామమందిర నిర్మాణానికి జరిగిన భూమిపూజ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు దళిత వర్గానికి చెందిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌నూ పిలిచి ఉండాల్సిందని బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి అన్నారు. ఆగస్ట్ 5న జరిగిన మందిర శంకుస్ధాపనకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌నూ ఆహ్వానించాల్సిందని, ఆయన హాజరు మంచి సందేశం పంపిఉండేదని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు దళిత సాధువులు ఆసక్తి కనబరిచినా వారిని పూర్తిగా విస్మరించారని మాయావతి ఆరోపించారు. మరోవైపు లక్నోలో 108 అడుగుల ఎత్తైన పరుశురాముని విగ్రహ ఏర్పాటుకు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ప్రతిపాదనను ఆమె దుయ్యబట్టారు.
బ్రాహ్మణ ఓటర్లను ఆకట్టుకునేందుకే ఎస్పీ ఈ ఎత్తుగడ వేస్తోందని ఆరోపించారు. బీఎస్పీ హయాంలో వివిధ కులాలకు చెందిన ప్రముఖ సాధుసంతుల పేర్లతో పలు పథకాలు చేపట్టామని, ఎస్పీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కుల దృక్పథంతో వాటి పేర్లను మార్చారని విమర్శించారు. పరుశురాముడి విగ్రహం గురించి ఎస్పీ ఇప్పుడు మాట్లాడటం కంటే అధికారంలో ఉన్నప్పుడే ఆ విగ్రహాన్ని నిర్మించాల్సిందని చురకలు వేశారు. ఎస్పీ ప్రతిపాదిత విగ్రహం కంటే అధికంగా పరుశురాముడి భారీ విగ్రహాన్ని అయోధ్యలో నిర్మిస్తామని మాయావతి పేర్కొన్నారు. 2022లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 11 శాతం ఉన్న బ్రాహ్మణుల ఓట్లు కీలకం కావడంతో వారిని ఆకట్టుకునేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. చదవండి : అమెరికాలో 'అయోధ్య' సంబరాలు
Comments
Please login to add a commentAdd a comment