
లక్నో : అన్‌లాక్-4లో భాగంగా కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలను బీఎస్పీ అధినేత్రి మాయావతి స్వాగతించారు. ఇవి రాజకీయ పార్టీలు, వ్యక్తులకు అతీతంగా ప్రజలందరికీ సర్వజన సమ్మతంగా ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. 'కోవిడ్19 పోరులో భాగంగా అన్‌లాక్‌కు సంబంధించి కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలు ఏకీకృతంగా ఉన్నాయి. వాటిని స్వాగతిస్తున్నాం. బీఎస్పీ చాన్నాళ్లుగా ఈ డిమాండే చేస్తోంది. కరోనా ముసుగులో రాజకీయాలు చేయడం తగదని మేం ఎప్పటి నుంచో చెబుతున్నాం. కేంద్రం తాజాగా విడుదల చేసిన గైడ్‌లైన్స్ చాలా సంతృప్తికరంగా ఉన్నాయి. దీని వల్ల ప్రజలకు మరిన్ని సౌకర్యాలు సైతం అందుతాయి' అంటూ మాయావతి పేర్కొన్నారు. (అందరూ స్వదేశీ యాప్‌లను వాడాలి: మోదీ)
కంటైన్‌మెంట్ జోన్ల వెలుపల మరిన్ని కార్య కలాపాల పునరుద్ధరణకు వీలుగా కేంద్ర హోం శాఖ అన్‌లాక్–4 మార్గదర్శకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటిలో భాగంగా పలు నగరాలకు ప్రాణాధారంగా మారిన మెట్రో రైళ్లు ఎట్టకేలకు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ ఏడో తేదీ నుంచి దశలవారీగా మెట్రో రైళ్లను నడపడానికి కేంద్రం అనుమతించింది. స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు మాత్రం సెప్టెంబర్ 30వ తేదీ దాకా మూసే ఉంటాయని ప్రకటించింది. విద్యా సంస్థలపై ప్రస్తుతం అమలులో ఉన్న ఆంక్షలను స్వల్పంగా సడలించింది. సెప్టెంబర్ 21 నుంచి 50 శాతం మించకుండా ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది హాజరుకావొచ్చని, 9 నుంచి 12 తరగతుల మధ్య విద్యార్థులు స్వచ్ఛందంగా గైడెన్స్ కోసం హాజరుకావొచ్చని పేర్కొంది. (అన్‌లాక్ 4: 7 నుంచి మెట్రో..)
Comments
Please login to add a commentAdd a comment