జైపూర్ : రాజస్తాన్‌లో రాజకీయ సంక్షోభం రోజుకో మలుపుతిరుగుతోంది. రాజస్తాన్ అసెంబ్లీలో అశోక్ గహ్లోత్ సర్కార్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని బీఎస్పీ ఎమ్మెల్యేలను కోరుతూ పార్టీ అధినేత్రి మాయావతి జారీ చేసిన విప్ ఆసక్తికరంగా మారింది. బీఎస్పీ తరపున ఎన్నికైన ఆరుగురు ఎమ్మెల్యేలతో కూడిన ఆ పార్టీ శాసనసభాపక్షం 2019 సెప్టెంబర్‌లో కాంగ్రెస్‌లో విలీనమైంది. ఈ విలీనానికి రాజస్తాన్ అసెంబ్లీ స్పీకర్ ఆమోదముద్ర వేశారు. బీఎస్పీ ఎమ్మెల్యేలు లఖన్ సింగ్, దీప్ చంద్, ఆర్ గుడా, వాజిబ్ అలీ, జేఎస్ అవానా, సందీప్ కుమార్‌లకు ఆ పార్టీ విప్ జారీ చేసింది. విప్‌ను ధిక్కరిస్తే వారు అనర్హత వేటుకు గురవుతారని బీఎస్పీ నేత సతీష్ చంద్ర మిశ్రా హెచ్చరించారు. బీఎస్పీ జాతీయ పార్టీ అని, జాతీయస్ధాయిలో బీఎస్పీ కాంగ్రెస్‌లో విలీనం అయితే మినహా రాష్ట్రస్ధాయిలో ఆరుగురు ఎమ్మెల్యేల విలీనం చెల్లుబాటు కాదని పేర్కొన్నారు. చదవండి : రాజస్తాన్ హైడ్రామా : స్పీకర్ పిటిషన్ వెనక్కి..
అందుకే రాష్ట్రస్ధాయిలో తమ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ శాసనసభాపక్షంలో విలీనం కావడం చెల్లుబాటుకాదని వివరించారు. 2016లో పాలక టీఆర్‌ఎస్‌లో 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 12 మంది పాలక పార్టీలో విలీనమైన కేసు తెలంగాణ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న అంశాన్ని ఆయన ప్రస్తావించారు. అయితే మిశ్రా వాదనను కాంగ్రెస్ నేతలు తోసిపుచ్చారు. వారు సాంకేతికంగా బీఎస్పీ ఎమ్మెల్యేలు కానందున వారికి విప్ వర్తించదని గహ్లోత్ శిబిరం వాదిస్తోంది. మరోవైపు బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో విలీనానికి స్పీకర్ ఆమోదాన్ని సవాల్ చేస్తూ బీజేపీ, బీఎస్పీలు ఇప్పటికే న్యాయస్ధానాలను ఆశ్రయించాయి . ఇక సచిన్ పైలట్ తిరుగుబాటుతో 19 మంది ఎమ్మెల్యేలు దూరమవడంతో గహ్లాత్ సర్కార్ మైనారిటీలో పడిందని రెబల్ నేతలు చెబుతుండగా 200 మంది సభ్యులు కలిగిన రాజస్తాన్ అసెంబ్లీలో తమకు 103 మంది ఎమ్మెల్యేల బలముందని గహ్లోత్ శిబిరం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఈ 103 మందిలో బీఎస్పీ నుంచి చేరిన 6 ఎమ్మెల్యేలున్నారు.
Comments
Please login to add a commentAdd a comment