సాక్షి, ముంబై: భివండీలో చిన్నారులకు సోకే మీజిల్స్ వ్యాధి రోజురోజుకూ విస్తరిస్తోంది. పట్ణణవ్యాప్తంగా ఇప్పటి వరకు 341 మందికి వ్యాధి లక్షణాలు ఉన్నాయని గుర్తించి, వారికి పరీక్షలు నిర్వహించారు. వారిలో ఇప్పటికి 44 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఇందిరాగాంధీ ప్రభుత్వ వైద్యాధికారి సైయద్ బుషరా పేర్కొన్నారు. ఇంకా కొంత మంది రిపోట్లు పుణే సెంటర్ నుంచి రానున్నట్లు ఆమె తెలిపారు. ఇందులో ముంబైలోని కస్తూర్బా ఆస్పత్రిలో చాలా మంది పిల్లలు చికిత్స పొందుతున్నారు. వ్యాధి కారణగా ఠాణాలోని కల్వా ఆసుప్రతిలో ఒకరు, ముంబైలోని కస్తూర్బా ఆస్పత్రిలో ఒకరు మృతి చెందారని అన్నారు. స్వల్ప లక్షణాలు ఉన్నవారు స్థానిక ఇందిరా గాంధీ ఆసుపత్రిలో, పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు.
భివండీలో హైరిస్క్ ప్రాంతాలు...
భివండీ పట్టణంలో 8 లక్షల 98 వేల 923 మంది జనాభా ఉంది. ఇందులో 341 మంది పిల్లలకు వ్యాధి లక్షణాలు కనిపించాయి. 130 మంది వ్యాధిగ్రస్తులు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, 211 మంది పిల్లలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటికి చికిత్స పొందుతున్నారు. ఎక్కువ శాతం భివండీలోని మురికి వాడలలో గల గాయిత్రినగర్, నదినాక, నయీబస్తి, శాంతినగర్, అంజూర్‌పాట, ఆజ్మీనగర్, ఈద్గారోడ్, గైభినగర్, మిల్లత్‌నగర్, కామత్‌ఘర్, అవుచిత్‌పాడ, బండారి కంపౌండ్ ఇలా 12 ప్రాంతాలలో ఉన్న పిల్లలకు ఇన్‌ఫెక్షన్ డిసీస్ తొందరగా వ్యాప్తి చెందుతుండటంతో ఈ ప్రాంతాలను హైరిస్క్ ప్రాంతాలుగా ప్రకటించారు. మురికివాడల్లో ఈ వ్యాధి లక్షణాలున్న మరికొంత మంది పిల్లలు కూడా ఉండవచ్చనే అనుమానంతో ప్రతి గుడిసెలో సోదాలు చేయడం ప్రారంభించామని, ఈ సోదాల్లో డాక్టర్ సుంఖ సంజనా, డాక్టర్ స్వపనాళి, డాక్టర్ మినల్, జాక్టర్ రాజ్‌కుమార్ తదితర్లు పాల్గొంటున్నట్లు వైద్యాధికారి పేర్కొన్నారు.
పట్టణంలో 3,075 మంది పిల్లలకు ఎం.ఆర్.–1 వ్యాక్సినేషన్ ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు 2,302 మంది పిల్లలు అనగా 75 శాతం పూర్తి అయిందని అన్నారు. ఎం.ఆర్.–2 వ్యాక్సినేషన్ 2,291 మంది పిల్లలకు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు 1,791 మంది పిల్లలకు అనగా 78 శాతం మందికి వ్యాక్సినేషన్ అందించామని వైద్యాధికారి బుషరా పేర్కొన్నారు. స్వర్గీయ ఇందిరా గాంధీ ప్రభుత్వ ఆసుపత్రితో పాటు, పట్టణవ్యాప్తంగా 16 ఆరోగ్య కేంద్రాలలోనే గాకుండా స్వచ్చంధ సంస్థల కార్యాలయాలలో, పాఠశాలల్లో, బస్టాండ్, అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి పిల్లలకు వ్యాక్సినేషన్ ఇస్తున్నట్లు తెలిపారు. వ్యాధి లక్షణాలు కనపడితే తక్షణమే ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాల్సిందిగా ప్రచారం ముమ్మరంచేశామని వైద్యాధికారులు చెబుతున్నారు.
టీకాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం...
వ్యాధి తీవ్రంగా ప్రబలడానికి పేద జీవన పరిస్థితులు, పెద్ద కుటుంబాలు, సరైన ఆరోగ్య సేవలు లేకపోవడం, పారిశుద్ధ్య సౌకర్యాలు, పోషకాహార లోపం, చిన్నారుల్లో పేలవమైన రోగనిరోధక శక్తి, టీకాలు ఇవ్వకపోవడం వంటివి నగరంలో వ్యాధి వ్యాప్తికి కొన్ని ప్రధాన కారణాలని వైద్య నిపుణులు అంటున్నారు. పౌర డేటా ప్రకారం, 2020లో 25, 2021లో తొమ్మిది మీజిల్స్ కేసులు నమోదవగా, ఈ సంవత్సరం మీజిల్స్ కేసులు ముంబైలో బహుళ రెట్లు పెరిగాయి. 2023 చివరి నాటికి ఈ వ్యాధిని నిర్మూలించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ మహానగరం వ్యాధి వ్యాప్తికి సాక్ష్యంగా నిలుస్తోంది.
అంతకుముందు, ముంబైలో 2019లో మీజిల్స్ కారణంగా మూడు మరణాలు నమోదయ్యాయి, 2020లో నాగ్‌పూర్, చంద్రపూర్, అకోలాలో ఒక్కో మరణం నమోదైంది. థానే, ముంబైలో 2021లో ఒక్కొక్క మరణం నమోదైంది. ఒక వారంలో ఐదు అనుమానిత ఇన్ఫెక్షన్ కేసులు ఉంటే, వాటిలో రెండు కంటే ఎక్కువ ప్రయోగశాల పరీక్షలో నిర్ధారించబడినట్లయితే, దానిని వ్యాధి వ్యాప్తిగా పేర్కొంటారని మహారాష్ట్ర ఆరోగ్య నిఘా అధికారి ప్రదీప్ అవతే వెల్లడించారు. ముంబై వెలుపల కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందడంతోపాటు, పొరుగున ఉన్న థానే జిల్లాలోని భివండీ పట్టణంలోని కొన్ని ప్రదేశాలలో ఏడు కేసులు, నాసిక్ జిల్లాలోని మాలెగావ్ ఐదు కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ పేర్కొంది.
కరోనా కూడా కారణమే: గోమరే
2020, 2021సంవత్సరాలలో కరోనా మహమ్మారి కారణంగా, సాధారణ టీకాలు వేసే కార్యక్రమాలు సైతం ప్రభావితమయ్యాయని, ఫలితంగా మీజిల్స్‌కు వ్యతిరేకంగా టీకాలు వేసే కార్యక్రమం కూడా దెబ్బతిందని బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారి ఒకరు తెలిపారు. ఈ కారణంగానే పెద్ద సంఖ్యలో పిల్లలు మొదటి లేదా రెండవ డోసులను వేసుకోలేదు. నష్టనివారణ చర్యల్లో భాగంగా ఇప్పుడు మీజిల్స్ వ్యాప్తిని నియంత్రించడానికి మూడు–పాయింట్ల కార్యక్రమాన్ని చేపట్టామని బీఎంసీ ఎగ్జిక్యూటివ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మంగళ గోమరే వెల్లడించారు. ఈ సంవత్సరం, సెప్టెంబర్ చివరి వారం నుంచే కేసులు అకస్మాత్తుగా పెరగడం ప్రారంభమైందని, దీంతో పరిస్థితి ఇప్పుడు ఆందోళనకరంగా మారిందని గోమరే తెలిపారు. మీజిల్స్ డోస్ వేసుకోని పిల్లల కోసం 100–150 అదనపు సెషన్ల టీకాల క్యాంపులను ఏర్పాటు చేస్తామని ఆమె చెప్పారు. ఇప్పటికే 2 ఏళ్లలోపు 10 వేల మంది పిల్లలకు టీకాలు వేయించామని, మిగిలిన 10 వేల మంది చిన్నారులకు, 5 ఏళ్లలోపు 40 వేల మందికి వ్యాక్సినేషన్‌ను వారం రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గోమరే తెలిపారు.
వ్యాధి లక్షణాలివే...
దగ్గు, తుమ్ము సమయంలో వ్యాధి సోకిన వ్యక్తులు వదిలే శ్వాసకోశ బిందువుల ద్వారా ఈ వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుంది. ఇది మోరిబిలివైరస్ వల్ల కలిగే ఇన్‌ఫెక్షన్, ఇది మనుషులకు మాత్రమే సోకుతుంది. ఇది సోకినవారికి తీవ్రంగా జలుబు, దగ్గు, విరోచనాలు, జ్వరం, కండ్లల్లో దురద తదితర లక్షణాలుంటాయి. చెవి, ముఖం నుంచి మొదలై శరీర భాగం మొత్తం దద్దుర్లు ఏర్పడుతాయి. తక్కువ వయసు కల్గిన పిల్లలకే ఈ వ్యాధి సోకే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వీరిలో రోగ నిరోధక శక్తి లోపించిన వారికే ఎక్కువ శాతం వ్యాధి ప్రమాదకరంగా మారుతోంది.
– డా.బుషరా సైయద్, ఇందిరాగాంధీ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యాధికారి
Comments
Please login to add a commentAdd a comment