లక్నో: యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో మహిళలు, చిన్నారులపై నేరాలు గణనీయంగా పెరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా వైద్య విద్యార్థిని దారుణ హత్యకు గురవ్వడం కలకలం రేపోతుంది. వివరాలు.. ఢిల్లీకి చెందిన డాక్టర్ యోగిత గౌతమ్(25) ఆగ్రా ఎస్ ఎన్ మెడికల్ కాలేజీలో గైనకాలజీ విభాగంలో వైద్యురాలిగా పని చేస్తున్నారు. దాంతో పాటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతోంది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం నుంచి ఆమె కనిపించడం లేదు. దాంతో కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే ఆమె హత్యకు గురయినట్లు తెలిసింది. యోగిత మృతదేహం బమ్రోలి అహిర్ ప్రాంతంలో లభ్యమయ్యింది. ఢిల్లీ శివపూరి ప్రాంతానికి చెందిన యోగిత ప్రస్తుతం మాస్టర్ సర్జరీ చదవుతున్నారు. మంగళవారం వెలువడిన ఫలితాల్లో ఆమె సర్జన్‌గా క్వాలిఫై అయ్యారు. (ప్రాణాపాయంలో యువతి.. ఇదేం పని)
ఆ మరుసటి రోజే ఆమె హత్యకు గురవ్వడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. తమ కుమార్తెను కిడ్నాప్ చేసి హత్య చేశారని ఆరోపిస్తున్నారు. యోగిత చివరి సారిగా మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో కాలేజీలో ప్రాంగణంలో కనిపించినట్లు సమాచారం. బుధవారం ఉదయం ఆమె తల్లిదండ్రులు ఆగ్రా ఎంఎం గేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిలో యోగిత మోరదాబాద్ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిందని తెలిపారు. యోగిత సీనియర్, కాన్పూర్‌కు చెందిన వివేక్ తివారి తనను వివాహం చేసుకోవాల్సిందిగా యోగితను వేధిస్తుండేవాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. యోగిత తనను వివాహం చేసుకోకపోతే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని తివారి తమను బెదిరించాడని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ మాటలతో భయపడిన తాము యోగితను తీసుకెళ్లేందుకు బుధవారం ఆగ్రా చేరుకున్నామని.. కానీ అప్పటికే ఆమె కనిపించకపోవడంతో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. యోగిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు వికాస్ తివారి మీద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment