పార్లమెంట్ ప్రారంభోత్సవం తొలిరోజే ప్రతిష్టించిన చారిత్రాత్మక సెంగోల్ ఒరిగిపోయిందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చారిత్రాత్మక సెంగోల్ గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేసిన కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని మాటల దాడి చేశారు. సరిగ్గా ప్రారంభోత్సవం రోజే ధర్మానికి ప్రతీక, మన చారిత్రక సంప్రదాయం అపహాస్యం పాలైందంటూ విమర్శలు కురిపించారు స్టాలిన్. భారత రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే.
ఈ మేరకు భారత రెజ్లర్లు పార్లమెంట్ కొత్త భవనం వెలుపల నిరసన చేసేందుకు యత్నించడంతో ఢిల్లీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే తమిళనాడు సీఎం బీజేపీపై విమర్శలతో విరుచుకుపడ్డారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ గత కొన్ని నెలలుగా నిరసనలు చేస్తున్నా ఇంతవరకు అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.
పైగా శాంతియుతంగా పార్లమెంట్ వెలుపల నిరసన చేసేందుకు వచ్చిన రెజ్లర్లను ఈడ్చుకెళ్తూ..వారిని అదుపులోకి తీసుకెళ్లడం అనేది తీవ్రంగా ఖండించదగినదన్నారు. న్యాయం చేయలేక ధర్మానికి ప్రతీక అయిన సెంగోల్ తొలిరోజే వంగినట్లు కనిపించింది అని మండిపడ్డారు. రాష్ట్రపతిని పక్కకు తప్పించి, ప్రతిపక్షాల బహిష్కరణల మధ్య కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం రోజున ఇలాంటి దారుణం జరగడం న్యాయమేనా? అని డీఎంకే నేత స్టాలిన్ ట్విట్టర్ వేదికగా కేంద్రాన్ని నిలదీశారు.
(చదవండి: శుభోదయం.. నవోదయం)
Comments
Please login to add a commentAdd a comment