లిక్కర్‌ కేసు: కవితతో ముగిసిన కేటీఆర్ ములాఖత్ | Sakshi
Sakshi News home page

లిక్కర్‌ కేసు: కవితతో ముగిసిన కేటీఆర్ ములాఖత్

Published Sun, Apr 14 2024 1:53 PM

Mlc Kavitha Investigation Is Ongoing In Cbi Custody - Sakshi

సాక్షి, ఢిల్లీ: లిక్కర్‌ కేసులో అరెస్టయి ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితతో.. ఆమె సోదరుడు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ములాఖత్‌ ముగిసింది. దాదాపు గంటన్నర పాటు ఈ ములాఖత్‌ కొనసాగింది. కేటీఆర్‌ వెంట కవిత భర్త అనిల్‌ కుమార్‌, న్యాయవాది మోహిత్‌ ఉ‍న్నారు. ఇక.. ములాఖత్‌ ముగిసిన అనతంరం మీడియాతో మాట్లాడటాన్ని కేటీఆర్‌ నిరాకరించారు. లాయర్లతో చర్చించాల్సి ఉందని కేటీఆర్‌ తెలిపారు. ఇక.. ఆదివారం(ఏప్రిల్‌ 14) కవితను కలిసేందుకు కేటీఆర్‌ హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. 

ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఎమ్మెల్సీ కవిత విచారణ కొనసాగుతోంది. రేపటితో  కవిత సీబిఐ కస్టడీ ముగియనుంది. రేపు ఉదయం 10 గంటలకు రౌస్ ఎవెన్యూ కోర్టులో కవితను  సీబీఐ హాజరు పర్చనుంది. సీబీఐ అధికారుల బృందంలో మహిళా అధికారులు కవితను విచారిస్తున్నారు.

లిక్కర్ పాలసీ అక్రమాల్లో కవిత కీలక వ్యక్తి అని సీబీఐ పేర్కొంది. ఆమ్ ఆద్మీ పార్టీకి కవిత వంద కోట్ల ముడుపులు అప్పచెప్పారని సీబీఐ అభియోగం. సౌత్ గ్రూప్ నుంచి డబ్బు సమకూర్చడం, నిందితులు, అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చిన వాంగ్మూలాలు, వాట్సాప్‌ చాట్స్‌పై కవితను సీబీఐ ప్రశ్నిస్తోంది. కవిత విచారణను సీబిఐ వీడియో రికార్డు చేస్తోంది. 

ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై సీబీఐ ప్రశ్నల వర్షం కురిపించింది. అసలు ఈ లిక్కర్‌ స్కాంలోకి ఎవరి ప్రోద్బలంతో వచ్చారనే ప్రశ్నతో సీబీఐ శనివారం విచారణను ప్రారంభించింది.

ఈ స్కాంలో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్, ఇతర ఆప్‌ నేతలు, హైదరాబాద్‌కు చెందిన వ్యాపార వేత్త అరుణ్‌ పిళ్లై, పారిశ్రామిక వేత్త శరత్‌చంద్రరెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, సమీర్‌ మహేంద్రు, విజయ్‌నాయర్, దినేష్‌ల పాత్రపై, వీరికి కవితతో ఉన్న సంబంధాలు, ఆర్థిక లావాదేవీలపై కవితను విచారించింది. రూ.100 కోట్ల నగదు చేతులు మారిందని, దీన్ని గోవా ఎన్నికల్లో ఖర్చు చేశారని, ఎవరెవరు ఎంత ఇచ్చారు, ఎంత అందుకున్నారు అనే అంశాలను శుక్రవారం సీబీఐ కోర్టుకు తెలిపింది. వీటిపైనా శనివారం సీబీఐ కవితను ప్రశ్నించింది.

Advertisement
Advertisement