తిరువొత్తియూరు: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని బిడ్డను హత్య చేసిన మహిళతోపాటు ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. కాగా, ఈ దారుణంపై పోలీసుల కథనం మేరకు.. కృష్ణగిరి జిల్లా రాయకోట సమీపంలోని ఓడంపట్టి గ్రామానికి చెందిన మాదేశు (27) కూలి పనులు చేసుకుని జీవిస్తున్నాడు.
ఇతడికి భార్య జ్ఞానమలర్ (21), ప్రకాష్ (3), ఆదిరా (9 నెలలు) పిల్లలున్నారు. మాదేశు రోజూ కూలి పనులకు వెళ్లేవాడు. ఈ క్రమంలో జ్ఞానమలర్‌కు అదే గ్రామానికి చెందిన రైతు సాయి తంగరాజ్ (28)తో పరిచయం ఏర్పడి, ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. మాదేశు పనికి వెళ్లిన అనంతరం సాయితంగరాజ్, జ్ఞానమలర్ ఇంట్లో ఉల్లాసంగా గడిపేవారు. ఈ క్రమంలో ఈ సంగతి మాదేశుకు తెలియడంతో భార్యను మందలించాడు.
దీంతో ఆగ్రహం చెందిన జ్ఞానమనర్ ఈ విషయాన్ని తంగరాజ్‌కు తెలిపింది. బిడ్డ ఉండడంతో వివాహేతర సంబంధం కొనసాగడం కష్టమని, బిడ్డలను హత్య చేయమని జ్ఞానమలర్ తెలిపింది. దీంతో, తంగరాజు ఇచ్చిన పథకం ప్రకారం జ్ఞానమలర్ కన్న పిల్లలు ప్రకాష్, ఆదిరాకు ఎలుక మందు పేస్టును ఇచ్చింది. ఇది తిన్న చిన్నారులు వాంతులు చేసుకుని, స్పృహ తప్పారు. ఇది చూసిన ఇరుగుపొరుగు వారు ఆ బిడ్డలకు విషం ఇచ్చినట్టు గుర్తించి, కృష్ణగిరి ప్రభుత్వాస్పత్రికి చికిత్స కోసం తీసుకువెళ్లారు.
వీరిలో ఆదిరా గత ఐదో తేదీ ఉదయం మృతి చెందాడు. ఈ విషయమై మాదేశు రాయకోట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసి, జ్ఞానమలర్, ఆమె ప్రియుడు తంగరాజును అరెస్టు చేశారు. నిందితులను వారిద్దరినీ కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment