పుణె: నాన్ పార్కింగ్ జోన్లలో నిలిపిన వాహనాలను ట్రాఫిక్ సిబ్బంది క్రేన్ సాయంతో తొలగించే ఘటనలను చూసే ఉంటాం. తాజాగా పుణెలో నాన్ పార్కింగ్ జోన్‌లో నిలిపిన వాహనాన్ని కూడా ఇలానే క్రేన్ సాయంతో పక్కకు తొలగించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలయ్యింది. ఇక దీనిపై నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రూల్స్ పాటించని వాహనాలను తొలగిస్తే.. నెటిజనులు ఎందుకు కోప్పడటం అంటే.. ఆ వాహనం మీద ఓ మనిషి కూడా ఉన్నాడు. ఇరువురుని క్రేన్ సాయంతో వ్యాన్‌లో ఎక్కించి అక్కడ నుంచి తీసుకెళ్లారు. ట్రాఫిక్ పోలీసులు అత్యుత్సాహంపై నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు..
మహారాష్ట్ర, నానాపేఠ్ ప్రాంతంలో గురువారం ఈ సంఘటన చోటు చేసుకుంది. నాన్ పార్కింగ్ జోన్‌లో నిలిపి ఉంచిన బైక్‌ను క్రేన్ సాయంతో పక్కకు తరలించమని ఉన్నతాధికారి తన సిబ్బందిని ఆదేశించాడు. ఇంతలో బైక్ యజమాని వచ్చి.. వారిని అడ్డుకున్నాడు. ఏకంగా బైక్ మీద ఎక్కి కూర్చున్నాడు. బండి మీద నుంచి దిగమని ఆదేశించినప్పటకి అతడు వినలేదు. ఆగ్రహించిన ట్రాఫిక్ పోలీసులు మనిషితో సహా బైక్‌ను కూడా క్రేన్ సాయంతో ఎత్తి వ్యాన్‌లో దించారు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌కావడంతో నెటిజనులు ట్రాఫిక్ పోలీసులు తీరుపై ఆగ్రహం వ్యక్త చేశారు. దీనిపై ఉన్నతాధికారి ఒకరు స్పందిస్తూ.. అతడిని బైక్ మీద నుంచి దిగమని కోరాం. కానీ వినలేదు. అందుకే ఇలా చేశాం. ఆ తర్వాత అతడు ఫైన్ కట్టి బండిని తీసుకెళ్లాడు. ఇక ఈ చర్యకు పాల్పడ్డ సిబ్బందిపై చర్యలకు ఆదేశించాం అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment