
మహారాష్ట్రలో సినిమా థియేటర్లను మళ్లీ తెరిచేందుకు రాష్ట్ర సర్కారు ఎట్టకేలకు ఒప్పుకుంది. దీంతో అక్టోబర్ 22 నుంచి సినిమా హాళ్లు తెరుచుకోనున్నాయి. అయితే ప్రతిపక్ష బీజేపీ.. ప్రజలకు వినోదం అందిస్తోందని, థియేటర్లు తెరవాల్సిన అవసరం లేదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సెటైర్లు పేల్చారు.
ముంబై: మహారాష్ట్రలోని సినిమా హాళ్లు, థియేటర్లను అక్టోబర్ 22వ తేదీ నుంచి తెరిచేందుకు ప్రభుత్వం ఆంక్షలతో కూడిన అనుమతినిచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా థియేటర్లు, సినిమా హాళ్ల యాజమాన్యాలు అన్ని జాగ్రత్తలను తీసుకోవాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సూచించారు. పాటించాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం త్వరలోనే జారీచేస్తుందని ఆయన పేర్కొన్నారు. శనివారం కోవిడ్–19 టాస్క్‌ఫోర్స్‌తో సమావేశమైన సీఎం ఈ మేరకు ప్రకటన చేశారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సీతారాం కుంటే, శివసేన ఎంపీ సంజయ్ రౌత్, సినీ నిర్మాతలు రోహిత్ శెట్టి, కునాల్ కపూర్, మకరంద్ దేశ్‌పాండే, మరాఠీ నటులు సుభోద్ భావే, ఆదేశ్ బండేకర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, రాష్ట్రంలోని ఆలయాలను అక్టోబర్ 7వ తేదీ నుంచి తెరుస్తామని ప్రభుత్వం శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించి మార్గదర్శకాలను కూడా జారీచేసింది. అలాగే, అక్టోబర్ 4వ తేదీ నుంచి పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనను ప్రారంభిస్తున్నట్లు కూడా ప్రకటించింది. (ముంబై - హైదరాబాద్‌ల మధ్య బుల్లెట్ రైల్.. సిద్ధమైన ప్రతిపాదనలు)
బీజేపీ ఉండగా.. థియేటర్లు తెరవడం అవసరమా?
రాష్ట్ర ప్రజలను రంజింపజేయడానికి బీజేపీ ఉండగా, సినిమా థియేటర్లను తెరవడం అవసరమా అని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు శివసేనకు చెందిన సామ్నా పత్రికలో సంపాదకీయం రాసిన ఆయన, బీజేపీకి చురకలంటించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష బీజేపీ అన్ని పరిమితులను దాటి వ్యవహరిస్తోందని విమర్శించారు. దేశవ్యాప్తంగా కరోనా, ఆంక్షలు ఉన్నప్పటికీ రాజకీయ డ్రామాలు సాగుతూనే ఉన్నాయన్నారు. ప్రతిపక్ష బీజేపీ ఆడుతున్న డ్రామాలో మిస్టరీతో పాటు కామెడీ కూడా ఉందన్నారు. ప్రస్తుత ప్రతిపక్షం కామెడీ చేస్తోందని, ప్రజా ఉపయోగ పనులు చేయకుండా, ఇతరులను ఈడీ విచారణల పేరుతో భయపెట్టడం, వ్యక్తిత్వాలను మంటగలపడం చేస్తోందని సంజయ్ రౌత్ మండిపడ్డారు. (చదవండి: ప్యాన్‌కేక్ .. ఆ రుచి వెనుక కష్టాల కథ)
Comments
Please login to add a commentAdd a comment