భోపాల్: ముఖ్యమంత్రి, రాజకీయ ప్రముఖులకు చల్లని చాయ్ అందించిన వ్యవహారంలో.. ఓ అధికారికి షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ప్రొటోకాల్ ఉల్లంఘన పేరిట జారీ అయిన ఆ నోటీసుకు సరైన వివరణ ఇవ్వకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఉన్నతాధికారులు.
ముఖ్యమంత్రికి అందించిన టీ బాగోలేదని, పైగా చల్లగా ఉందంటూ మధ్యప్రదేశ్‌లో ఓ కిందిస్థాయి అధికారిపై చర్యలకు ఉపక్రమించారు. జూనియర్ సప్లై ఆఫీసర్ రాకేశ్ కాన్హౌ ప్రోటోకాల్ ఉల్లంఘించారని ఉన్నతాధికారుల ఆరోపణ. ఈ మేరకు ఛాతర్‌పూర్ జిల్లా రాజ్‌నగర్ సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్(ఎస్‌డీఎం) డీపీ ద్వివేది.. రాకేశ్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం కోసం ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. సోమవారం ఖజురహో ఎయిర్‌పోర్ట్‌లో కాసేపు ఆగారు. ఆ సమయంలో ఎయిర్‌పోర్ట్ వీఐపీ లాంజ్‌లో సీఎంతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు ఉన్నారు. వాళ్లకు టిఫిన్‌తో పాటు టీ అందించారు అధికారులు. అయితే టీ చల్లారిపోయి ఉండడంతో వాళ్లంతా అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ విషయం తెలిసిన ఉన్నతాధికారులు.. ఆ కార్యక్రమ వ్యవహారాలను చూసుకున్న జూనియర్ సప్లై ఆఫీసర్ రాకేశ్‌కు నోటీసులు పంపించారు. నాసికరం, పైగా చల్లారిన టీ అందించినందుకు మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని, లేకపోతే ఏకపక్షంగా చర్యలు కఠినంగానే తీసుకుంటామని ఎస్‌డీఎం ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment