
ఇండోర్: బ్లాక్ ఫంగస్ (మ్యూకోర్‌మైకోసిస్) బారినపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన భర్తకు యాంఫోటెరిసిన్–బి ఇంజెక్షన్లు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరిస్తూ ఓ మహిళ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లోని బాంబే హాస్పిటల్‌లో సదరు మహిళ భర్త (40) చికిత్స పొందుతున్నారు. బ్లాక్ ఫంగస్ చికిత్సలో భాగంగా ఇప్పటికే యాంఫోటెరిసిన్–బి ఇంజెక్షను ఇచ్చారు. మరికొన్ని ఇవ్వాల్సి ఉంది. కానీ, అందుబాటులో లేవు. ఆందోళనకు గురైన అతడి భార్య ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ మంగళవారం వీడియో పోస్టు చేసింది.
‘‘బాంబే హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నా.. బ్లాక్ ఫంగస్ సోకడంతో నా భర్తను ఈ ఆసుపత్రిలోనే చేర్పించాం. ఆయనకు కళ్లు, దవడల్లో విపరీతమైన నొప్పి వస్తోంది. ఇక్కడ యాంఫోటెరిసిన్–బి ఇంజెక్షన్లు లేవు. ఈ స్థితిలో నా భర్తను ఎక్కడికి తీసుకెళ్లగలను? ఈ రోజు ఇంజెక్షన్ ఇవ్వకపోతే ఆసుపత్రి పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటా. అంతకు మించి మరో మార్గం లేదు’’ అని వీడియోలో ఆమె స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి, ఇండోర్ కలెక్టర్‌ను కూడా ఉద్దేశించి మాట్లాడింది. బాధిత మహిళకు కౌన్సిలింగ్ ఇచ్చామని, భర్తకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో మానసికంగా కలత చెందిందని బాంబే ఆసుపత్రి జనరల్ మేనేజర్ చెప్పారు. ఆమె భర్తకు ఇప్పటివరకు 59 ఇంజెక్షన్లు ఇచ్చామని, మరికొన్ని ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రస్తుతానికి తమ వద్ద అవి అందుబాటులో లేవని ఆయన వివరించారు.
(చదవండి: Delhi: చేతులపై మోసుకెళ్లి..బామ్మకు కరోనా టీకా)
Comments
Please login to add a commentAdd a comment