ముంబై: ముంబైలోని వీధి కుక్కలకు క్యూఆర్ కోడ్ ఉన్న ఆధార్ కార్డులు జారీ చేసింది ఓ స్వచ్చంద సంస్థ. ఇప్పటికే ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాల్లో 20 కుక్కలకు ఆధార్ కార్డులు కూడా జారీ చేసి వాటి మెడలో ట్యాగ్స్ వేశామని తెలిపింది సదరు సంస్థ.
ఎందుకంటే..
మనుషులకు ఆధార్ కార్డు అందుబాటులోకి వచ్చిన తర్వాత అన్ని పనులు తేలికైపోయాయి. ఎక్కడ ఏ పని కావాలన్నా ఆధార్ కార్డు చూపిస్తే చాలు మొత్తం బయోడేటా కళ్ళముందు ప్రత్యక్షమవుతుంది. మనుషుల్లాగే కుక్కలకు కూడా ఒక గుర్తింపు ఉండాలనే ఆలోచనకు శ్రీకారం చుట్టారు ముంబైకి చెందిన ఒక ఇంజినీరు. ఈ కార్డును స్కాన్ చేయగానే కుక్క వయసు, ఎక్కువగా సంచరించే ప్రాంతం, సంతానానికి సంబంధించిన వివారాలు, స్టెరిలైజేషన్ సమాచారం తోపాటు కాంటాక్ట్ చేయవలసిన ఫోన్ నెంబర్లు తదితర వివరాలన్నింటినీ తెలుసుకోవచ్చు.
ముంబైకి చెందిన ఇంజనీర్ అక్షయ్ రిడ్లాన్ కుక్కలకు ఆధార్ కార్డులు జారీ చేయాలన్న ఈ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చాడు. అనుకుందే తడవు "pawfriend.in" అనే స్వచ్చంద సంస్థ సాయంతో వీధి కుక్కల్లో కొన్నిటికి ఆధార్ కార్డులను రూపొందించి వాటి మెడలో ట్యాగ్ కట్టారు. ఈ కార్డు మీద ఒక క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. క్యుఆర్ స్కానర్ ద్వారా ఆ కోడ్ ను స్కాన్ చేస్తే చాలు ఆ కుక్క వివరాలన్నీ వచ్చేస్తాయి. తద్వారా వీధి కుక్కలు ఎప్పుడైనా తప్పిపోతే దాన్ని తిరిగి సొంతగూటికి చేర్చడం చాలా సులభమవుతుందని ఆయనన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా బ్రిహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వారు ఎయిర్పోర్టు సమీపంలోని వీధి కుక్కలను వల వేసి పట్టుకుని వాటికి వ్యాక్సినేషన్ కూడా చేస్తున్నట్లు స్థానికుల్లో ఒకరు తెలిపారు. ఇదిలా ఉండగా ముంబైలోని అన్ని ప్రాంతాల కుక్కలకు ఈ తరహా కార్డులు జారీ చేయాలన్నది మా సంకల్పమని తెలిపింది ఆ సంస్థ.
ఇది కూడా చదవండి: పెళ్ళిలో ఏనుగులు హల్ చల్.. బైక్ మీద పారిపోయిన కొత్త జంట..
Comments
Please login to add a commentAdd a comment